కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది. జూన్ నెలకు సంబంధించి సంబంధిత శాఖ నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రాజెక్ట్ ప్రాంతంలోని 14 శాతంలో నీటి లభ్యత చాలా తక్కువ లోతులోనే ఉన్నాయి. 2083 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐదు మీటర్ల లోపు, ఐదు నుంచి పది మీటర్ల మధ్యలోనే ఉన్నాయి. నిరుడు ఈ పరిమాణం కేవలం నాలుగు శాతం అంటే 675 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ప్రాజెక్టు పరిధిలో పది మీటర్ల లోపు భూగర్భ జలాలు ఉండే ప్రాంతం గత ఏడాదితో పోలిస్తే 1408 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది. ఇదే సమయంలో భూగర్భజలాలు లోతుగా ఉండే ప్రాంతం 32 శాతం మేర తగ్గింది. గత దశాబ్ద కాలంగా ఇప్పుడే భూగర్భ జలమట్టం భారీగా పెరిగిందని నివేదిక పేర్కొంది.
జూన్లో 2 జిల్లాల్లోనే తక్కువ వర్షపాతం
నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రభావంతో భూగర్భ జలమట్టం బాగా పెరిగిందని తెలిపింది. జూన్ నెల చివరి వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 34 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మొత్తం 33 జిల్లాలకు గాను 26 జిల్లాల్లో అధిక, ఐదు జిల్లాల్లో సాధారణ, రెండు జిల్లాల్లోనే తక్కువ వర్షపాతం నమోదైంది. 589 మండలాల్లో 375 మండలాల్లో అధిక, 137 మండలాల్లో సాధారణ, 73 మండలాల్లో తక్కువ, నాలుగు మండలాల్లో చాలా తక్కువ వర్షపాతం నమోదైనట్లు భూగర్భ జలవనరుల శాఖ తెలిపింది.