అత్యాధునిక సాంకేతికతతో అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాలు అగ్రరాజ్యాలుగా చలామణి అవుతున్నాయి. ఆ దిశగా అభివృద్ధి సాధించేందుకు స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. ఇదే సదవకాశంగా భావించిన టెక్నాలజీ సంస్థ గ్రీన్ రోబోటిక్స్... భారత రక్షణ రంగానికి ఏఐ డ్రివెన్ ఆయుధ సంపత్రిని అందించేందుకు ముందుకొచ్చింది. అమెరికాలో బయో ఇన్ఫర్మాటిక్స్ పూర్తిచేసిన కిరణ్‌రాజు... దేశానికి భవిష్యత్ తరం సాంకేతిక ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో గ్రీన్ రోబోటిక్స్ అనే సంస్థను స్థాపించారు.
ఇటీవల ఈ సంస్థ బెంగళూరులోని ఎయిరోఇండియాలో నవరత్న కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్‌తో చేసుకున్న అవగాహన ఒప్పందం అందరి దృష్టిని ఆకర్షించింది. గ్రీన్ రోబోటిక్స్ భారత ఆర్మీకి ఇన్‌ఫారెడ్ సిస్టంతో పనిచేసే ఆర్మ్‌డ్ వెపన్ తయారీకి కావాల్సిన సాంకేతికతను అభివృద్ధి పరిచింది. కృత్రిమ మేథ, రోబోటిక్స్ ఆధారిత ఈ సిస్టం... యుద్ధభూమిలో అడుగుపెట్టిన సైనికుడు కమాండ్ కంట్రోల్ ద్వారా కనెక్ట్ అయి ఉండేలా.. తన లక్ష్యాన్ని పది రెట్లు సమర్థవంతంగా చేరుకునేలా ఈ సీ4ఐఎస్ఆర్టీ సిస్టం పనిచేయనుంది. ఈ నూతన సాంకేతికత పటిష్ఠంగా ఉందని గ్రీన్ రోబోటిక్స్ డిఫెన్స్ హెడ్ తెలిపారు.