తెలంగాణ

telangana

ETV Bharat / city

బల్దియా ఖజానా ఖాళీ.. జీతాల చెక్కులు వెనక్కి - జీహెచ్​ఎంసీ ఖజానా ఖాళీ

జీహెచ్​ఎంసీ ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఖాతాల్లో నిధుల్లేక బ్యాంకుకు పంపిన చెక్కులు కూడా వెనక్కి వచ్చాయి. కొవిడ్ కారణంగా పన్నుల వసూళ్లను నిర్లక్ష్యం చేశారు. దీంతో ఆస్తి పన్నులు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

greater hyderabad municipal corporation treasury empty no funds for salaries
బల్దియా ఖజానా ఖాళీ.. జీతాల చెక్కులు వెనక్కి

By

Published : Dec 16, 2020, 7:15 AM IST

జీహెచ్‌ఎంసీకి జీతాల చెల్లింపునకు నిధులు సమకూరట్లేదు. సగం నెల గడిచినప్పటికీ పలు జోనల్‌ కార్యాలయాల పరిధిలోని పారిశుద్ధ్యం, ఇంజినీరింగ్‌, వెటర్నరీ, టౌన్‌ప్లానింగ్‌, ఇతరత్రా విభాగాల కార్మికులు, ఉద్యోగుల వేతనాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. సికింద్రాబాద్‌ జోనల్‌ కార్యాలయానికి మరింత గడ్డు పరిస్థితి తలెత్తింది. ఖాతాలో నిధుల్లేక జీతాల చెక్కును ఎస్బీఐ బ్యాంకు వెనక్కి పంపింది. మొదటిసారి జీతాల చెక్కు వెనక్కి వచ్చిందని అధికారులు గగ్గోలు పెడుతున్నారు.

కోటి జనాభా, 20లక్షల నిర్మాణాలు, విస్తృత ఆదాయ వనరులు ఉన్నా అధికారుల నిర్లక్ష్య వైఖరితో బల్దియా ఖజానా ఖాళీ అయింది. ఉద్యోగులు, కార్మికులకు నవంబరు జీతాలను ఇప్పటికీ పూర్తిస్థాయిలో చెల్లించకపోవడమే అందుకు నిదర్శనం. ఎల్బీనగర్‌, చార్మినార్‌ జోన్లలో చాలా మందికి జీతాలు అందలేదు. కొందరు పూర్తిస్థాయి ఉద్యోగులకు సగం నెల పూర్తయ్యాక జమ అయింది.

పన్ను వసూలు చేయాలంటూ ఆదేశాలు..

కొవిడ్‌కు ముందు నిరక్షరాస్యుల సర్వే, కొవిడ్‌ వ్యాప్తి మొదలయ్యాక ఐదు నెలల పాటు లాక్‌డౌన్‌ నిర్వహణ పనులు, అనంతరం ధరణి సర్వే, వరదలు, ఎన్నికల పనులు, ఇలా నిత్యం తీరికలేకుండా బాధ్యతలు అప్పగించడంతో సర్కిల్‌ ఉపకమిషనర్లు ఆస్తిపన్ను వసూళ్లను కొంత మేర నిర్లక్ష్యం చేశారు. అయినప్పటికీ పౌరులు ఆన్‌లైన్‌, ఇతరత్రా మాధ్యమాల ద్వారా ఆశించిన దానికంటే ఎక్కువ మొత్తంలో పన్ను చెల్లించారు. బాండ్ల జారీ, టర్మ్‌లోన్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు వెచ్చించాల్సి ఉండటంతో ఆ నిధులన్నీ ఎప్పటికప్పుడు ఖర్చైనట్లు కేంద్ర కార్యాలయం ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు-ఈటీవీ భారత్​’తో తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తాజాగా కమిషనర్‌ కార్యాలయం ఆస్తిపన్ను వసూళ్లను పెంచుకోవాలని సూచించినట్లు ఆయన వివరించారు. ఆ మేరకు జోనల్‌ కమిషనర్లు, సర్కిళ్ల ఉపకమిషనర్లు సంబంధిత బిల్‌ కలెక్టర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని వివరించారని గుర్తుచేశారు.

ఇదీ చూడండి:పీఆర్‌సీపై చర్చలకు సిద్ధమైన తెలంగాణ సర్కార్‌

ABOUT THE AUTHOR

...view details