Sadar Celebrations: అంబరాన్ని అంటేలా సదర్ సంబురాలు హైదరాబాద్ నారాయణగూడలో సదర్ ఉత్సవాలు సందడిగా సాగాయి. దున్నపోతులతో చేయించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వైఎంసీఏ కూడలిలో యాదవ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు.. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డోలు నృత్యాలు.. దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
అలయ్ బలయ్ పేరుతో..
నారాయణగూడ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఏడాది మొత్తం పాల వ్యాపారం చేసుకునే యాదవులు ఈ ఒక్క రోజు అలయ్ బలయ్ పేరుతో సదర్ ఉత్సవాలు నిర్వహించుకుంటారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.
'అధికారికంగా నిర్వహిస్తాం'
దేశంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలు జరుపుకుంటామని కిషన్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి రాగానే సదర్ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. సదర్ వేడుకలకు తరలివచ్చిన జనంతో నారాయణగూడ ప్రాంతం కిక్కిరిసిపోయింది. డప్పు చప్పుళ్లు, వాద్యాలతో దున్నరాజులను ఆడిస్తూ.. కోలాహలంగా వేడుక నిర్వహించారు. శేరిలింగంపల్లిలో నిర్వహించిన సదర్ వేడుకల్లో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొని ఉత్సాహంగా నృత్యం చేశారు.
ఇదీచూడండి:Minister Niranjan Reddy: 'ఎట్టి పరిస్థితుల్లోనూ వరి పంట వేయొద్దు.. ఇదే ప్రభుత్వ విధానం'