తెలంగాణ

telangana

ETV Bharat / city

Gramee Naturals Telangana : గ్రామీ నేచురల్స్.. ఈ గానుగ నూనెలు ఆరోగ్యానికి శ్రేయస్కరం - గ్రామీ నేచురల్స్

Gramee Naturals Telangana : ప్రస్తుత పరిస్థితుల్లో తినే ఆహారపదార్థాల నుంచి వంటల్లో వాడే నూనెల వరకూ అన్నింట్లో కల్తీ పెరిగిపోతుంది. ఈ విషయం గ్రహించిన ఓ యువకుడు సంప్రదాయ గానుగ పద్ధతులకు, కొద్ది పాటి సాంకేతికతను జోడించి సరికొత్త వ్యాపారం ప్రారంభించాడు. ప్రజలకు సహజసిద్ధ పద్ధతుల్లో తీసిన నాణ్యమైన నూనెలు అందిస్తూ వేగంగా తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నాడు. అతడే.. గ్రామీ నేచురల్స్‌ వ్యవస్థాపకుడు రాజు.

Gramee Naturals Telangana
Gramee Naturals Telangana

By

Published : Dec 16, 2021, 1:31 PM IST

ఈ గానుగ నూనెలు ఆరోగ్యానికి శ్రేయస్కరం

Gramee Naturals Telangana : పాత కాలంలో నూనెల కోసం గానుగలను వినియోగించే వాళ్లు మన పూర్వికులు. మారిన సాంకేతికత, ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో ఆ పద్ధతుల్ని మర్చిపోయాం. ఇప్పుడంతా ప్యాకెట్లల్లో నిల్వ చేస్తున్న నూనెలు, ఆహార పదార్థాలే వాడుతున్నాం. కానీ.. వాటిలో కల్తీలు, నిల్వ ఉండే రసాయనాల వినియోగం పెరగడంతో తిరిగి మన మూలాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి.

తల్లి కోసం మొదలుపెట్టి..

Gramee Naturals Hyderabad : ఈ మధ్య కాలంలో రసాయనాలు వినియోగించని సేంద్రియ ఆహార ఉత్పత్తుల వినియోగం బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తన తల్లి ఆహారంలో వాడేందుకు సహజ నూనెల కోసం వెతికాడు హైదరాబాద్‌కు చెందిన రాజు. మార్కెట్‌లో నిల్వ ఉండే ప్రిజర్వేటీవ్‌లు వాడుతున్న నూనెలే కనిపించడంతో ఆలోచనలో పడ్డాడు. తానే సహాజ నూనెల్ని అందించాలని నిర్ణయించుకున్నాడు.

ఒక్క గానుగతో ప్రారంభించి..

Ganuga Oil Hyderabad : ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ధరలతో పోల్చితే గానుగతో తీసిన ఉత్పత్తల ధరలు కొంచెం అధికం. ఈ కారణంగా వినియోగదారులు ముందుకు రారేమో అనుకున్నాడు. వ్యాపార ప్రణాళికలో భాగంగా నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించాడు. తొలుత ఒక గానుగతోనే నూనెలు తీయడం ప్రారంభించాడు.

"గానుగ నూనెల ధర ఎక్కువగా ఉంటుందని అందరు భావిస్తారు. కానీ రీఫైండ్ ఆయిల్​తో పోలిస్తే గానుక నూనె వాడకం తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఖర్చు ఎక్కువగా అవ్వదు. హైదరాబాద్​లో హోం డెలివరీ చేస్తున్నాం. మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు కూడా హోం డెలివరీకి ప్రయత్నిస్తున్నాం."

- రాజు, గ్రామీ నేచురల్స్ వ్యవస్థాపకుడు

పోలీసు ఉద్యోగం వదులుకుని..

Ganuga Oil in Telangana : వ్యాపారం ప్రారంభించిన మొదట్లోనే పోలీస్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు రాజు. తన వ్యాపారాన్ని వదులుకోవడం ఇష్టం లేక ఉద్యోగానికి వెళ్లలేదు. హైదరాబాద్​ మూసాపేటలోని తన యూనిట్‌ పైనే పూర్తిగా దృష్టి పెట్టి పనిచేశాడు. ఆ ఫలితంగానే ఒక గానుగ స్థాయి నుంచి పరిశ్రమ స్థాయికి విస్తరించాడు.

10 రకాల నూనె ఉత్పత్తులు

తమిళనాడు నుంచి గానుగలను తీసుకువచ్చిన రాజు వాటికి కొద్దిపాటి సాంకేతికత జోడించి పని మొదలుపెట్టాడు. వాటి సర్వీసింగ్ విషయంలో ఇబ్బందులు రావడంతో సొంతంగానే గానుగలు తయారు చేయించి నూనెలు తీస్తున్నాడు. పొద్దుతిరుగుడు, పల్లీ, కొబ్బరి, నువ్వులు, సాఫ్రాన్ సహా 10 రకాల నూనెలను ఉత్పత్తి చేస్తున్నాడు. వేరువేరు రకాల నూనెలకు వేరువేరు గానుగలు ఆడిస్తూ నిల్వ రసాయనాలు కలపకుండా విక్రయిస్తున్నాడు.

"ఇక్కడ మన కళ్ల ముందే ఆయిల్ తీస్తారు. రీఫైండ్ ఆయిల్ అయితే మనం ఎక్కువగా వాడతాం. కానీ ఈ గానుగ నూనె కొంచెం వేసినా కూరలు రుచిగా ఉంటాయి. ఈ నూనె నాణ్యత చాలా బాగుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. ఇక్కడి నుంచే పసుపు, పప్పులు కూడా తీసుకెళ్తున్నాం. వాటి రుచి చాలా బాగుంది."

- వినియోగదారులు

నాణ్యత చెక్​ చేసుకోవచ్చు..

కేవలం నూనెలనే కాకుండా అధికంగా కల్తీకి గురవుతున్న పసుపు, కారం వంటి వాటిని కూడా గ్రామీ నేచురల్స్‌ ద్వారా ప్రజలకు అందిస్తున్నాడు. సహజ పద్ధతుల్లో ప్రాసెస్‌ చేస్తుండడం వల్ల పోషక విలువలు అధికంగా ఉంటాయంటున్నాడు ఈ యువకుడు. కావాలనుకుంటే.. కొనుగోలుదారులు నేరుగా తమ యూనిట్‌కు వచ్చి ఉత్పత్తుల నాణ్యత పరిశీలించవచ్చని ఆహ్వానిస్తున్నాడు.

హోమ్ డెలివరీ కూడా..

గ్రామీ నేచురల్స్‌ ద్వారా 200లకు పైగా ఉత్పత్తుల్ని అందిస్తున్న రాజు.. ఉద్యోగ, వ్యాపార వర్గాల నుంచి మంచి స్పందన వస్తుందని చెబుతున్నాడు. నగరంలో రెండు చోట్ల ఔట్లేట్ల ద్వారా విక్రయాలు జరుపుతుండగా.. హైదరాబాద్‌ వ్యాప్తంగా హోమ్ డెలివరీ చేస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details