Gram Panchayat Audit in Telangana : పంచాయతీల్లో నిధుల వ్యయం ఇష్టారాజ్యంగా సాగుతోంది. ఒక పనికే రెండుసార్లు బిల్లులు చెల్లించడం, తక్కువ పనికి ఎక్కువ మొత్తంలో డబ్బులివ్వడం, కొలతల పుస్తకాలు(ఎంబుక్‌లు) అమలు చేయకపోవడం.. ఇలా 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 12,769 పంచాయతీల్లో ఏకంగా 2.12 లక్షల ఆడిట్ అభ్యంతరాలు నమోదయ్యాయి. పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు నిబంధనలు బేఖాతరు చేసి నిధులు వ్యయం చేస్తున్నట్లు రాష్ట్ర ఆడిట్ శాఖ నిగ్గు తేల్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆడిట్ అభ్యంతరాలు మచ్చుకు కొన్ని..
ఒకే పనికి రెండుసార్లు చెల్లింపులు
Telangana Gram Panchayats Audit : ఖమ్మం జిల్లా పండితాపురం పంచాయతీలో ఒకపనికి ఒకే నెలలో రెండుసార్లు బిల్లులు చెల్లించారు. గ్రామ సంతలో సిమెంట్ కాంక్రీట్, ఇతర పనులకు రూ.1,74,266 మొత్తాన్ని రెండుసార్లు చెల్లించారు. ఒకే ఎంబుక్ ఆధారంగా ఇలా సొమ్ములివ్వడం గమనార్హం. 2020 అక్టోబరు 3న 1646710 చెక్ నంబరుతో చెల్లించగా అక్టోబరు 6న 1678886 నంబరు చెక్‌తో మరోసారి డబ్బు ఇచ్చారు. పలు సందర్భాల్లో పనుల కంటే ఎక్కువ మొత్తాన్ని కాంట్రాక్టర్లకు ఇచ్చారు.
కొనుగోళ్లలో నిబంధనలు బేఖాతరు
Gram Panchayats Audit 2022 : భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పర్ణశాల పంచాయతీలో రూ.9.46 లక్షల విలువైన కొనుగోళ్లలో కనీస నిబంధనలు పాటించలేదు. బ్లీచింగ్ పౌడర్, ట్రీగార్డ్‌లు, ఎలక్ట్రిక్ పరికరాలు, స్ప్రేయర్లను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారు. బహిరంగ టెండర్ విధాన అనుసరించాల్సి ఉండగా పట్టించుకోలేదు.
మొక్కల కొను‘గోల్‌మాల్’
Panchayats Audit in Telangana : పూర్వపు ఖమ్మం జిల్లాలోని ఓ పంచాయతీలో ఏపీలోని కడియపులంకలో రెండు నర్సరీల నుంచి రూ.3.55 లక్షలతో మొక్కలు కొన్నట్లు బిల్లులు చెల్లించారు. ఎన్ని మొక్కలు.. నాటిన వివరాలు లేకపోవడం గమనార్హం. హరితహారం, ట్రీగార్డ్‌లు, నర్సరీల ఏర్పాటు, పైపులు సహా వివిధ పనులకు రూ.9.44 లక్షలు చెల్లించారు.
మరికొన్ని..
- మెజారిటీ పంచాయతీల్లో బడ్జెట్ ఆమోదం లేకుండానే నిధులు వ్యయం చేస్తున్నారు.
- అత్యధిక పంచాయతీల్లో ఇంజినీర్లు చెక్ మెజర్‌మెంట్ చేయకుండానే అధికారులు చెల్లింపులు చేసేస్తున్నారు.
- ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ, ఐటీ, లేబర్‌సెస్ వసూలు చేయకుండా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరుస్తున్నారు.
- లైసెన్స్ ఫీజులు వసూలుకు చర్యలు తీసుకోవడంలేదు.