రాష్ట్రంలో పట్టభద్రుల ఎన్నికల సందడి మొదలుకానుంది. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. ఇవాళ్టి నుంచి 8 రోజుల పాటు నామినేషన్లు స్వీకరించనున్నారు. 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 26 వరకు గడువు ఇచ్చారు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మార్చి 17న జరగనుంది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్ - పట్టభద్రుల ఎన్నికల సందడి
శాసనమండలి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. నేటి నుంచి ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు మూడు ఉమ్మడి జిల్లాల్లో 5 లక్షల 60 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉమ్మడి మూడు జిల్లాల నుంచి ఇప్పటి వరకు 5 లక్షల 60 వేల మంది ఓటర్లుగా పేర్లు నమోదుచేసుకున్నారు. ఈ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రంగా ఎల్బీ స్టేడియంలోని ఇండోర్ స్టేడియాన్ని తాత్కాలికంగా ఎంపిక చేసినట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. 616 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్‌తో పాటు మౌలిక సదుపాయాల కల్పన చేపట్టనున్నారు.
ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్ఠంగా అమలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ప్రియాంక అలాను రిటర్నింగ్ అధికారిగా నియమించారు. నామినేషన్లను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని 3వ అంతస్తులోని ఆర్వో కార్యాలయంలో స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్ లోకేశ్‌కుమార్ ఎన్నిక విధులు నిర్వహించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ ఎన్నికల్లో దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వారు, కరోనా పాజిటివ్ వ్యక్తుల వద్దకే ఎన్నికల సిబ్బంది వెళ్లి ఓట్లను వేయించాలని అధికారులు నిర్ణయించారు.