ఉమ్మడి హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 5,31,268 ఓటర్లుండగా... 3,36, 256 మంది పురుషులు, 1,94,944 మంది స్త్రీలు ఉన్నారు. ఇతరులు 68 మంది ఉన్నారు. మొత్తం 799 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఎన్నికల నిర్వహణ సాఫీగా జరగడానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక ఫ్లయ్యింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల నిర్వహణలో మొత్తం 3,835 మంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు పూర్తయిన ఏర్పాట్లు
హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానానికి జరిగే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మార్చి 14 న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పోలింగ్ ప్రక్రియ కోసం అధికారులు సమాయత్తమాయ్యారు. ఈనెల 17న ఎల్బీనగర్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పూర్తి ప్రక్రియ మార్చ్ 22 తో పూర్తవుతుంది.
ఎన్నికల బరిలో అధికంగా 93 మంది ఉండడంతో జంబో బ్యాలెట్ పత్రంతో పాటు జంబో బ్యాలెట్ బాక్స్‌లను అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతీ పోలింగ్ కేంద్రానికి రెండు బ్యాలెట్ బాక్సుల చొప్పున 1,598 బ్యాలెట్ బాక్సులకు అదనంగా మరో 324 సిద్ధంగా ఉంచారు. పోలింగ్‌కు ఒక్కరోజు ముందు ఎల్బీ స్టేడియంలో ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయనున్నారు. ఓటింగ్ 14 న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు జరుగనుండగా, ఓట్ల లెక్కింపు- 17 న జరగనుంది. ఈ ఎన్నికల్లో 80 ఏళ్ల వృద్ధులకు, కరోనా పాజిటివ్ ఓటర్లకు వారి ఇంటి వద్దకే ఎన్నికల సిబ్బంది వెళ్లి పోస్టల్ బ్యాలెట్‌తో ఓటును వేయించనున్నారు.