గోదావరిలోనూ ఏపీ వాటానే అధికంగా ఉందంటూ గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ఆంధ్రప్రదేశ్ లేఖ రాసింది. 2014 జనవరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో గోదావరి బేసిన్‌లోని 1,480 టీఎంసీల నికర జలాల్లో తెలంగాణకు 967.14 టీఎంసీలు ప్రాజెక్టుల వారీగా నివేదించగా.. తాజాగా ఏపీ రాసిన లేఖలో 650 టీఎంసీలుగానే పేర్కొంది. దీంతో నీటి లభ్యత తక్కువగా ఉండే కృష్ణా బేసిన్‌లోనే కాదు.. ఎక్కువ లభ్యత ఉండే గోదావరిలో కూడా కొత్త వివాదానికి తెరలేపే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను ప్రస్తావిస్తూనే.... ఆంధ్రప్రదేశ్ అంతర్గత జలవనరుల విభాగం అభిప్రాయాలను ప్రత్యేకంగా పేర్కొంటూ ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్.. బోర్డు సభ్య కార్యదర్శికి లేఖ రాశారు.
నీటి పంపిణీకి ఎలాంటి ఒప్పందం లేదు
గోదావరిలో 1,480 టీఎంసీల నీటి లభ్యత ఉండగా.. 2014 జనవరిలో ఉమ్మడి ఏపీ శాసనసభకు ఇచ్చిన సమాచారంలో 967.14 టీఎంసీల వాటా ఉందని.. ఇందులో సాగునీటి ప్రాజెక్టులకు 912.25 టీఎంసీలు..జలవిద్యుత్తు ప్రాజెక్టులకు 54.89 టీఎంసీలని బోర్డు దృష్టికి తెలంగాణ తెచ్చింది. అయితే పునరుత్పత్తి ద్వారా వచ్చే నీటితో కలిపి 1,480 టీఎంసీలుగా అంచనా వేశారని.. గోదావరి నీటి పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం జరగలేదని.. గోదావరి బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్ దిగువన ఉన్నందున తెలంగాణలోని ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ బోర్డు ఆధీనంలో ఉండాలని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. అయితే అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అభిప్రాయం పేరుతో మరో అంశాన్ని చేర్చింది. 2014లో వాప్కోస్ ఇచ్చిన నివేదిక ప్రకారం 75 శాతం నీటి లభ్యత కింద పునరుత్పత్తి ద్వారా లభ్యమయ్యే 70 టీఎంసీలతో కలిపి గోదావరిలో ఉన్నది 1,430 టీఎంసీలేనని తెలిపింది. ఈ విషయాన్ని 2018 జులైలో కేంద్ర జల సంఘం కూడా చెప్పిందని.. దీన్ని బట్టి రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రాజెక్టులకు నీటి లభ్యత లేదని తెలిపింది.