రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (ప్యాక్స్) సంఖ్య భారీ ఎత్తున పెంచేందుకు సర్కారు విస్తృత కసరత్తు చేస్తోంది. ఈ నెలలో పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నందున అవి పూర్తైన తర్వాత ఎప్పుడైనా సహకార సంఘాల ఎన్నికలు జరగవచ్చని అధికార వర్గాల అంచనా. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇంత వరకూ సహకార సంఘాలకు ఎన్నికలు జరగలేదు. గత రెండేళ్లుగా ప్రతి ఆరు మాసాలకోసారి ఇంఛార్జీ పాలకవర్గాల పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగిస్తూ వస్తోంది. ప్రస్తుతమున్న గడువు వచ్చే నెల 5తో ముగియనుంది. మళ్లీ గడువు పొడగించాలా...? వద్దా...? ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తారా అని సహకార శాఖ తాజాగా ప్రభుత్వాన్ని అడిగింది.
81 మండలాల్లో ఒక్క ప్యాక్స్ కూడా లేదు..
మొత్తం 584 మండలాలు ఉండగా... 906 సహకార సంఘాలు ఉన్నాయి. కానీ, 81 మండలాల్లో కనీసం ఒక్కటి కూడా లేదు. మరికొన్ని మండలాల్లో 2 నుంచి 3 వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని కచ్చితంగా రెండు సంఘాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి ఏర్పాటైతే... వెంటనే ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నట్లు అధికారయంత్రాంగం భావిస్తోంది. రైతులకు గ్రామ స్థాయిలో అన్ని రకాల సేవలు వీటి ద్వారా అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల విక్రయాలు, ధాన్యం కొనుగోలు పరిమితంగా జరుగుతున్నాయి. ఇక నుంచి పంటల సాగుకు ముందుకు విత్తనాల విక్రయాలు మొదలుకుని పంట కోత తర్వాత కొనుగోలు దాకా అన్నీ రకాల సేవలు ప్యాక్స్ ద్వారా అందించాలని నిర్దేశించింది సహకార శాఖ.
కొత్త నిబంధనల ప్రకారం మరో సంఘం