వరద ప్రాంతాల్లో నష్టపోయిన బాధితులకు ప్రజాప్రతినిధులు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ముంపునకు గురైన పలు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. లాలాపేటలో ఉపసభాపతి పద్మారావుగౌడ్ తో కలిసి బాధితులను పరామర్శించారు. వారితో మాట్లాడిన కేటీఆర్ ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందించారు. అనంతరం రామంతపూర్ బోడుప్పల్‌లో మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే సుభాశ్ రెడ్డిలతో కలిసి వరద బాధితులకు 10 వేల రూపాయల నగదు, నిత్యావసర సరుకులను అందజేశారు. తర్వాత బర్కత్పుర రత్నానగర్లో పర్యటించిన మంత్రి.. నష్టపోయిన బాధితులకు ప్రభుత్వ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
తలసాని పరామర్శ..
సనత్ నగర్‌లోని మెండామార్కెట్, రాంగోపాల్ పేట్, బేగంపేట్ డివిజన్లతో పాటు గాంధీనగర్ లోని అరుంధతీ నగర్‌లో వరద ముంపునకు గురైన బాధితులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ప్రభుత్వం తరఫున 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండాఅన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.