కరోనా విలయతాండవం చేస్తున్నా ప్రాణాలు లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న తమకు సరైన గౌరవం లభించట్లేదని ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్న తమకు అవమానాలు, బెదిరింపులే మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైద్యుల సంఘం ఇప్పటికే ఏపీ సీఎస్ నీలం సాహ్నికి లేఖ రాసింది. మరోసారి సీఎస్‌ను కలిసి తమ సమస్యలు వివరించేందుకు సిద్ధమవుతోంది.
కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించండి
ఒకవైపు విధులు మరోవైపు ఉన్నతాధికారులు వారానికి రెండుసార్లు నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకావటం ఇబ్బందిగా ఉందని ప్రభుత్వ వైద్యుల సంఘం అభిప్రాయపడింది. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం తమకేం ఇబ్బంది లేకున్నా 15 రోజులకు ఒకసారి నిర్వహిస్తే తమ విధులకు ఆటంకం ఉండదని సూచిస్తోంది. ఇన్ని తట్టుకుని విధులకు హాజరవుతున్నా జిల్లాల్లో సంయుక్త కలెక్టర్లు నిర్వహించే సమీక్షా సమావేశాల్లో డీఎమ్హెచ్వోలను ఇబ్బంది పెడుతున్నారని ప్రభుత్వ వైద్యుల సంఘం తెలిపింది. ప్రకాశం జిల్లా డీఎమ్హెచ్వో సమావేశ ప్రారంభ సమయం కన్నా కాస్త ఆలస్యంగా వచ్చారన్న నెపంతో జాయింట్ కలెక్టర్... ఆయన్ని నిల్చోబెట్టారని ప్రస్తావించింది. అనంతపురం డీఎమ్‌హెచ్‌వోను సమీక్షా సమావేశంలో ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా దూషించినట్లు తెలిపింది. ఈ విషయాలను సీఎస్‌కు వివరించనున్న వైద్యుల సంఘం.. కొవిడ్-19 బాధ్యతలు జిల్లా సంయుక్త కలెక్టర్లు కాకుండా నేరుగా కలెక్టర్ పర్యవేక్షించేలా ఆదేశించాలని కోరే అవకాశం ఉంది.