ఆకర్షణీయమైన వివిధ కళారూపాలు అలవోకగా చేస్తున్న ఈయన పేరు గోవిందరాజులు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం జిన్న జగ్గంపేటలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సైన్సు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బొమ్మలు, కళా రూపాలతో బోధించడం ఈ గురువు ప్రత్యేకత. ఆకులు, సబ్బులు, సుద్ద ముక్కలు, కూరగాయలు, పండ్లపై బొమ్మలు చెక్కుతున్నారు. వీటితో పాటు కాగితాలతో బొమ్మలు కూడా తయారు చేస్తున్నారు. ఇలా అపురూపమైన వివిధ కళారూపాలు రూపొందించడంలో గోవిందరాజులు నైపుణ్యం సాధించారు. ఈ విధంగా ఈయన చేతి నుంచి జాలు వారిన బొమ్మలు, కళారూపాలు విద్యార్థులకు పాఠాల కథాంశాలుగా మారిపోయాయి.
సృజనాత్మకతను వెలికి తీసేందుకు..
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు.. వివిధ కళారూపాలతో విద్యా బోధన చేస్తున్నారు గోవిందరాజులు. అదే విధంగా అంతరించిపోతున్న తోలు బొమ్మల కళకు తిరిగి ప్రాణం పోసేందుకు సంకల్పించారు. స్పాంజ్‌తో తోలు బొమ్మలు తయారు చేసి.. వాటి ద్వారా కూడా పాఠాలు చెబుతున్నారు. ఈ విధమైన బోధన ద్వారా.. విద్యార్ధులు సులభంగా అవలోకనం చేసుకుంటారని గోవిందరాజులు చెబుతున్నారు.