Telangana students died in road accident: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థుల మృతిపై గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సంతాపం ప్రకటించారు. మృతదేహాలను భారత్‌కు తీసుకువచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని రాజ్ భవన్ అధికారులను ఆదేశించినట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇక ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురికి మెరుగైన వైద్య సహాయం అందించేలా విదేశీ వ్యవహారల శాఖను కోరారు.
అమెరికాలో ఈ నెల 21న జరిగిన రోడ్డు ప్రమాదం తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో హైదరాబాద్, ఖమ్మంకు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఉన్నత చదువుల కోసం యూఎస్‌కు వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.