CDS Rawat passed away: తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మృతి పట్ల.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి, ఆర్మీ అధికారుల మరణాలపై సంతాపం ప్రకటించారు.
బాధాకరం
దేశానికి 42 ఏళ్ల పాటు సేవలందించిన రావత్ మరణం.. దేశానికి, భారత సైన్యానికి తీరని లోటని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనలో రావత్‌తో పాటు ఆయన సతీమణి, మరో 11 మంది సైన్యాధికారులను కోల్పోవడం బాధాకరమని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
కేసీఆర్ దిగ్భ్రాంతి
CDS Rawat helicopter crash: హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన సతీమణి, పలువురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచి వేసిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రక్షణ రంగానికి బిపిన్ రావత్ చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
దేశానికి తీరని లోటు..
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నిరంతరం దేశ సేవలో, దేశపౌరుల భద్రత కోసం ఉన్న వ్యక్తి మరణం దేశానికి తీరని లోటన్నారు.