విశ్వవిద్యాలయాలు విశిష్ట నిలయాలుగా ఎదగాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల వీసీలతో ఆన్లైన్ సమీక్ష నిర్వహించారు. ఉపకులపతులకు దిశానిర్దేశం చేశారు.
విశ్వవిద్యాలయాలు విద్యా బోధనకే పరిమితం కాకుండా... పరిశోధన, ఆవిష్కరణలకు నిలయాలుగా మారాలన్నారు. గ్లోబల్ ఇన్నోవేషన్‌లో 49వ స్థానంలో ఉన్న భారత్‌ను టాప్-20లో నిలిపేందుకు వర్సీటీలు చురుగ్గా వ్యవహరించాలని కోరారు. యూనివర్సిటీల్లో కొవిడ్ సంక్షోభానికి సంబంధించిన సామాజిక, శాస్త్రీయ పరిశోధనలు జరగాలని తమిళిసై సూచించారు.
విద్య.. సామాజిక బాధ్యతను పెంపొందించాలని.. గ్రామాల దత్తత, ఎన్ఎస్ఎస్ సేవలను ప్రోత్సహించాలన్నారు. తరగతులు, పరీక్షలు సకాలంలో నిర్వహించి విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడాలని సూచించారు. ఆన్లైన్ తరగతులకు హాజరవలేకపోతున్న పేద వర్గాలకు తగిన సదుపాయాలు సమకూర్చాల్సిన బాధ్యత ఉందన్నారు. డిజిటల్ విద్య అంతరాలను తగ్గించాలి కానీ పెంచకూడదని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు అందరూ కృషిచేయాలని గవర్నర్ కోరారు.
యూనివర్సిటీల్లో ప్రగతి, ప్రణాళికలను వీసీలు.. గవర్నర్‌కు వివరించారు. సమీక్షలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి, వైస్ ఛైర్మన్లు లింబాద్రి, వెంకట రమణ పాల్గొన్నారు.
ఇదీచూడండి:రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దు