గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగు పరిస్తే.. పట్టణాలకు వలసలు తగ్గుతాయని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీజీ 150వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆమె వర్చువల్ విజువలైజేషన్ ద్వారా పాల్గొన్నారు. ప్రజల జీవనోపాధి, దేశాభివృద్ధికి గ్రామాల స్వయంసమృద్ధి ఎంతో అవసరమని.. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం స్ఫూర్తితో గ్రామాలు స్వయం సమృద్ధి పొందేలా సమగ్రాభివృద్ధికి అందరం కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జీవనోపాధి కల్పిస్తే.. వలసలు తగ్గుతాయి : గవర్నర్ తమిళిసై
గ్రామాల్లో అన్ని వర్గాలకు జీవనోపాధి కల్పిస్తే పట్టణాలకు వలసలు తగ్గుతాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ నిర్వహించిన గాంధీజీ 150వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆమె వర్చువల్ విజువలైజేషన్ ద్వారా పాల్గొన్నారు. పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం ముందుకు పోతుందని గాంధీజీ చెప్పినట్టు గవర్నర్ గుర్తు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఆత్మనిర్భర్ భారత్‌కు స్వయం సమృద్ధి సాధించే గ్రామాలకుఎంతగానో తోడ్పడతాయని గవర్నర్ అన్నారు. గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసల గురించి ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాలకు జీవనోపాధి కల్పిస్తే వలసలు అంతగా ఉండవని తెలిపారు. గాంధీజీ ఆదర్శాలను నెరవేర్చేందుకు స్వచ్ఛ భారత్, ఆత్మ నిర్భర్ భారత్, జాతీయ విద్యావిధానం, వ్యవసాయ చట్టాలు దోహదపడతాయన్నారు. భారతదేశం గ్రామాల్లో ఉందన్న మహాత్మాగాంధీ అభిప్రాయాలకు అనుగుణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, వ్యవసాయాన్ని బలోపేతం చేయడంలో అందరూ కలిసి రావాలని గవర్నర్ కోరారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు ప్రారంభించిన గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ ద్వారా గ్రామీణాభివృద్ధి కోసం చేస్తున్న కృషిని తమిళిసై ప్రశంసించారు.