MLA Stickers Misuse: తెలంగాణలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల పేరిట జారీ చేస్తున్న వాహనాల స్టిక్కర్ల దుర్వినియోగంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఏటా ఏప్రిల్ మొదటి తేదీన.. ఏడాది కాలపరిమితితో శాసనసభ, మండలి సభ్యులకు ప్రభుత్వం ఈ స్టిక్కర్లను పంపిణీ చేస్తోంది. ప్రతి సభ్యుడికి మూడేసి స్టిక్కర్లు ఇస్తారు. వివిధ కారణాల వల్ల అవి పనికిరాకుండా పోతే మరో రెండు స్టిక్కర్లు ఇస్తారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్టిక్కర్ల దుర్వినియోగంపై సర్కార్ నజర్
MLA Stickers Misuse: రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేస్తున్న.. వాహనాల స్టిక్కర్ల దుర్వినియోగంపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండడంతో నివారణ చర్యలపై సర్కార్ దృష్టి సారించింది. ఇకపై వారికి ఇచ్చే స్టిక్కర్లపై పేరుతో పాటు వాహనం నంబరు కూడా నమోదు చేయనున్నారు. స్టిక్కర్ వినియోగానికి గడువు తేదీని నిర్ణయించాలని యోచిస్తున్నారు.
ఇవి దుర్వినియోగమవుతున్నాయని గతంలోనే పలు ఉదంతాల్లో ప్రభుత్వం దృష్టికి వచ్చింది. తాజాగా క్యాసినో వ్యవహారంలో నిందితుడైన మాధవరెడ్డి ఇంట్లోని కారుపై మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించారు. గత మార్చి నెలాఖరు వరకు వినియోగించేలా దాన్ని జారీ చేయగా... అది ఇప్పటికీ కారుపై ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అయిదు వేలకు పైగా స్టిక్కర్లు వినియోగంలో ఉన్నాయి. ఇకపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే స్టిక్కర్లపై వారి పేరుతో పాటు వాహనం నంబరు కూడా నమోదు చేయనున్నారు. స్టిక్కర్ వినియోగానికి గడువు తేదీని పేర్కొంటారు. ఆ తేదీ ముగిసిన వెంటనే దాన్ని తొలగించి, విధిగా కొత్తవి వాడాలని సూచిస్తారు.