Telangana Fish Brand: రాష్ట్రంలో మత్స్య సంపద నుంచి ఆదాయం పెంపొందించేందుకు "తెలంగాణ చేపలు" అనే బ్రాండ్ సృష్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చేప పిల్లల పెంపకంపై ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న దృష్ట్యా ఆదాయం అదే స్థాయిలో పెరిగేలా చూడాలని "హబ్-స్పోక్" అనే పేరుతో ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలోని నీటి వనరుల్లో వదిలిన చేప పిల్లలు పెరిగి వేసవి సీజన్‌లో కొన్ని నెలల్లో మాత్రమే మార్కెట్‌కు వస్తున్నాయి. మిగతా నెలల్లో ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది. ఈ తరుణంలో ఏడాది పొడవునా చేపలు లభించేలా నీటి వనరుల్లో పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం... మత్స్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
మూడురున్న లక్షల మత్స్యకార కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. జాలరుల ఆదాయాలు పెంచడమే కాకుండా వినియోగదారులకు నాణ్యమైన చేపలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ చేపలు బ్రాండ్ ద్వారా మార్కెటింగ్ వ్యవస్థకు శ్రీకారం చుడుతోంది.