ఏకకాలంలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తి చేసేందుకు తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఇందుకోసం శిక్షణ ప్రక్రియ పూర్తి కాగా.. ప్రయోగాత్మకంగా పలు రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నారు. దసరా నాటికి ధరణి పోర్టల్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించగా.. పలు కారణాల రీత్యా మరో రెండు రోజులు ఆలస్యం కావచ్చని అధికారులు అంటున్నారు.
కొత్తచట్టంతో అమలు..
పూర్తి పారదర్శకమైన విధానంలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా కొత్త రెవెన్యూ విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడమే గాక ధరణి పోర్టల్ ద్వారా పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ విధానంలో కోర్ బ్యాంకింగ్ తరహాలో భూలావాదేవీలు జరిగేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అధికారాలను తహశీల్దార్, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అధికారాలను సబ్ రిజిస్ట్రార్లకు అప్పగించారు. భూముల విలువ నిర్ధారణకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్లకు విచక్షణాధికారాలు లేకుండా స్టాంపుల చట్టాన్ని కూడా సవరించారు. రాష్ట్రానికి సంబంధించిన చట్టం కావడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి సవరణను నిషేధించారు. వ్యవసాయ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తున్న తరహాలోనే వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ రంగులో పాసుపుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా గ్రామాలు, పట్టణాల్లోని వ్యవసాయేతర ఆస్తుల వివరాల ఆన్లైన్ నమోదు ప్రక్రియను సర్కారు చేపట్టింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షలకు పైగా వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. గ్రామపంచాయతీల్లో 58లక్షలకు పైగా, పట్టణాల్లో 16లక్షలకు పైగా, జీహెచ్ఎంసీలో ఐదు లక్షలకు పైగా ఆస్తులను ఆన్లైన్లో నమోదు చేశారు. భారీవర్షాల వల్ల గత కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీతో పాటు శివారు ప్రాంతాల్లో నమోదు నిలిచిపోయింది. కొందరు వ్యక్తిగతంగా సొంతంగా ఆస్తుల వివరాలను నమోదు చేసుకుంటున్నారు.