రిజిస్ట్రేషన్ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశలో కసరత్తు చేస్తున్న ప్రభుత్వం... అవసరమైన సమాచారాన్ని సేకరిస్తోంది. తరచూ ప్రభుత్వం అడుగుతున్న వివరాలను రిజిస్ట్రేషన్ శాఖ ఎప్పటికప్పుడు అందచేస్తోంది. గడిచిన మూడేళ్లకు చెందిన... ఆర్థిక సంవత్సరాల వారీగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా రిజిస్ట్రేషన్ల సంఖ్య, తద్వారా వస్తున్న ఆదాయం, మండలాల వారీగా జరుగుతున్న డాక్యుమెంట్ల సంఖ్య తద్వారా వస్తున్న రాబడుల వివరాలు తెప్పించుకుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల మధ్య ఉన్న దూరాలు... వాటి పరిధిలో ఉన్న మండలాలు ఎన్ని... గ్రామాలు ఎన్ని, పట్టణాలు ఎన్ని, ప్రధాన పట్టణాలు ఉంటే అవి ఎంత దూరంలో ఉన్నాయి... తదితర వివరాలను కూడా రిజిస్ట్రేషన్ శాఖ ప్రభుత్వానికి అందచేసింది.
మౌలిక వసతులపై ఆరా...
రాష్ట్రంలో ఉన్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎన్నింటికి సొంత భవనాలు ఉన్నాయి... సొంతభవనాల నిర్మాణానికి ఎన్నింటికి స్థలం కేటాయింపు జరిగింది... నిర్మాణాల్లో ఉన్నవి ఎన్ని... ఇప్పుడున్న మౌలిక వసతులు ఏమిటి... ఇంకా ఎలాంటి వసతులు కావాలి... తదితర వివరాలను కూడా అడిగింది. ఇప్పటికే 80 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు స్థలం కేటాయింపు జరిగిందని... సొంత భవనాలు కలిగి ఉన్న 30 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా అవసరమైన మేరకు మౌలిక వసతులు లేవని... సిబ్బంది కొరత ఉందని... నివేదించింది. అయితే ప్రభుత్వం సమగ్ర వివరాలు కావాలని అడగడంతో... సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా సిబ్బంది కొరత, మౌలిక వసతుల కల్పనకు, ఇతరత్ర అవసరాలకు ఎంత ఖర్చు అవుతుందో అంచనాలతో నివేదించినట్లు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వెల్లడించారు.
మిగతా రాష్ట్రాల విధానాలపై అధ్యయనం...
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా డాక్యుమెంటు రైటర్లు ఎందరు ఉన్నారు? వారి వివరాలు... వారి విద్యార్హతలు... ఎంత మంది లైసెన్స్‌దారులు ఉన్నారు. లైసెన్స్ లేని వారెందరు? తదితర వివరాలను కూడా రిజిస్ట్రేషన్ శాఖ నివేదించింది. డాక్యుమెంటు రైటర్ల విధానం బయట రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఏవిధంగా ఉందో తెలుసుకుని నివేదించాలని సూచించించినట్లు తెలుస్తోంది.
మెరుగైన విధానంపై దృష్టి...
వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములకు ధరల నిర్ణయం ఏలా జరిగింది... ఎంత కాలమైంది... ఇప్పుడున్న విధానంలో వస్తున్న ఇబ్బందులు ఏమిటి... ఇంతకంటే మెరుగైన విధానం ఏమైనా ఉందా ? తదితర వివరాలను కూడా ప్రభుత్వం అడిగినట్లు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలిపారు. సబ్ రిజిస్ట్రార్లకు ఉన్న విచక్షణాధికారులు ఏయే సెక్షన్ల కింద ఉన్నాయి...వాటి వల్ల జరుగుతున్న లాభం ఎంత... నష్టం ఎంత, ఆయా సెక్షన్లను తొలిగిస్తే వచ్చే సమస్యలు ఏమిటి...? తదితర వివరాలను కూడా తెప్పించుకున్న ప్రభుత్వం... విచక్షణాధికారాలను తొలిగించాలని ఇప్పటికే నిర్ణయించిట్లు తెలుస్తోంది.