ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సమగ్ర ప్రత్యామ్నాయ విధాన రూపకల్పన దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృత కసరత్తు చేస్తున్నారు. సమ్మె, ప్రత్యామ్నాయ చర్యలపై శనివారం సుధీర్ఘంగా సమీక్షించిన సీఎం.. ఆదివారం మరోసారి సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశమై భవిష్యత్లో ఆర్టీసీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంస్థ లాభాల బాటలో పయనించేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం ప్రభుత్వానికి ఇష్టం లేదని.. సంస్థ ఉండితీరాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేశారు.
- ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న 10,400 బస్సులను మూడు రకాలుగా విభజించి నడపనున్నారు. సగం బస్సులు అంటే 5200 పూర్తిగా ఆర్టీసీకి చెందినవి ఉంటాయి.
- మిగతా సగంలో 30 శాతం అంటే 3100 బస్సులు అద్దె బస్సులుగా ఉంటాయి. ఈ బస్సులు కూడా పూర్తిగా ఆర్టీసీ పాలనే కిందే ఉంటాయి.
- మిగిలిన 20 శాతం బస్సులు అంటే 2100 మాత్రం పూర్తిగా ప్రైవేట్ బస్సులుగా ఉంటాయి. ప్రైవేట్ బస్సులకు స్టేజ్ క్యారియర్లుగా అనుమతి ఇస్తారు. అద్దె, ప్రైవేట్ బస్సులు కూడా పల్లెవెలుగుతో పాటు హైదరాబాద్ నగరంలోనూ బస్సులు నడపాల్సి ఉంటుంది.
ఛార్జీలు ఎలా ఉంటాయంటే..?
ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల ఛార్జీలు కూడా సంస్థ నియంత్రణలోనే ఉంటాయని... ఆర్టీసీ ఛార్జీలు పెంచితేనే మిగతా బస్సులు కూడా ఛార్జీలు పెంచాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో 21శాతం అద్దెబస్సులున్నాయి. వీటికి అదనంగా మరో 9 శాతం బస్సులను అద్దెకు తీసుకుంటారు. ఆ మేరకు ఆర్టీసీకి కొత్త బస్సులు వచ్చినట్లేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఆర్టీసీ నియంత్రణలోనే బస్ పాసులు
బస్ పాసులన్నీ ఆర్టీసీ నియంత్రణలోనే ఉంటాయని... రాయితీ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని సీఎం చెప్పారు. అందుకు కావాల్సిన నిధులను బడ్జెట్ లోనే కేటాయిస్తామన్నారు. విద్యార్థులు, దివ్యాంగులు, స్వాతంత్ర్య సమరయోధులు, పాత్రికేయులు, పోలీసు అమరవీరుల కుటుంబాలకు చెందినవారు, ఉద్యోగులు తదితరులకు ఇచ్చే రాయితీ బస్ పాస్లు ఇక ముందు కూడా కొనసాగుతాయని ముఖ్యమంత్రి వెల్లడించారు.