తెలంగాణ

telangana

By

Published : Sep 11, 2021, 10:56 AM IST

ETV Bharat / city

మానవ వనరులు అభివృద్ధి చేసే దిశగా.. ఉద్యానవన పాలిటెక్నిక్ కళాశాలలు

ఉద్యానవన విద్యలో ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాల​ల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఉద్యానవన పంటలకు రాష్ట్ర అవసరాలు, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న డిమాండ్​ను దృష్టిలో ఉంచుకొని నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Horticulture_Polytechnics
ఉద్యానవన పాలిటెక్నిక్ కళాశాలలు

ప్రస్తుతం రాష్ట్రంలో రెండు ప్రభుత్వ ఉద్యాన పాలిటెక్నిక్​ కళాశాలలు ఉండగా... మరింత మందికి అవకాశం కల్పించేలా ప్రైవేట్ పాలిటెక్నిక్​ కళాశాలలను ప్రోత్సాహించేందుకు ప్రభుత్వం ఇటీవల చట్టసవరణ చేసింది. ములుగు అటవీకళాశాల, పరిశోధనా సంస్థను కూడా శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది.

పండ్లు, కూరగాయలు తదితర ఉద్యానవన పంటలకు డిమాండ్ చాలా ఉంది. రాష్ట్రానికి సరిపడా పండ్లతో పాటు కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రాష్ట్రంలో సాధారణ వ్యవసాయంతో పాటు ఉద్యానవన పంటలను ప్రోత్సాహిస్తున్న ప్రభుత్వం... ఈ రంగంలో పంట కోతలు, పక్వత, రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం, తదితర అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన అవసరమన్న భావనతో ఉంది. తద్వారా ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం, దిగుబడి పెరగడంతో పాటు ఆరోగ్యవంతమైన పండ్లు, కూరగాయలు అందుబాటులో లభిస్తాయన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఆ దిశగా ఉద్యానవన పంటల సాగు, నైపుణ్యాలపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. ఇందులో భాగంగా మరిన్ని ఉద్యానవన పాలిటెక్నిక్ కళాశాలలు రాష్ట్రంలో రావాలన్న ఆలోచనతో సర్కార్ ఉంది.

మరింత మందికి అవకాశం కల్పించేలా

ఉద్యానశాస్త్రంలో ప్రాథమిక విద్యను బోధించడం, పరిశోధన, ఉద్యోగావకాశాలను పెంపొందించే దిశగా అవసరమైన మానవవనరులు, సాంకేతిక అభివృద్ధి చేయడం ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం ఉద్యానశాస్త్రంలో డిప్లొమో కోర్సులను ప్రోత్సాహించనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు ప్రభుత్వ ఉద్యానవన పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగిరిఖిల్లాలో ఒకటి, ఆదిలాబాద్​లో మరొకటి ఉన్నాయి. శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఈ పాలిటెక్నిక్​లు ఉద్యానవిద్యలో రెండేళ్ల డిప్లమో కోర్సు అందిస్తున్నాయి. రెండు చోట్లా కలిపి కేవలం 50 సీట్లు మాత్రమే ఉన్నాయి. 2020 బ్యాచ్ లో రామగిరిఖిల్లాలో 23 మంది, ఆదిలాబాద్​లో 21 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. మరింత మందికి అవకాశాలు కల్పించేందుకు వీలుగా... ప్రైవేట్ రంగంలో ఉద్యాన పాలిటెక్నిక్​లను ప్రోత్సాహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇటీవల మంత్రివర్గ ఆమోదంతో ఆర్డినెన్స్​ను తీసుకొచ్చింది.

షరతులకు లోబడితే గుర్తింపు

ఉద్యాన విశ్వవిద్యాలయ చట్టానికి సవరణ చేసిన ప్రభుత్వం... ఉద్యానవన పాలిటెక్నిక్​లకు షరతులతో కూడిన గుర్తింపు ఇచ్చే అధికారాన్ని కొండా లక్ష్మణ్ యూనివర్సిటీకి కల్పించింది. దీంతో ఉద్యాన పాలిటెక్నిక్​లు ఏర్పాటు చేసేందుకు ఏవైనా ప్రైవేట్ సంస్థలు ముందుకొస్తే విశ్వవిద్యాలయం వాటిని పరిశీలించి షరతులకు లోబడి గుర్తింపు మంజూరు చేయనుంది. సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీకళాశాల, పరిశోధనా సంస్థను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకొచ్చింది. ములుగు అటవీకళాశాలను రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతంగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే కళాశాలలో చదివిన పలువురు విద్యార్థులు ఉన్నతవిద్య కోసం ప్రముఖ అంతర్జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందారు. అటవీశాస్త్రంలో విద్యాబోధన, పరిశోధనను మరింత మెరుగ్గా చేసేందుకు వీలుగా అటవీకళాశాల, పరిశోధనాసంస్థను ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకొస్తూ చట్టసవరణ చేశారు.

ఇదీ చూడండి:పర్యటకులను ఆకర్షిస్తోన్న 'తులిప్​' అందాలు

ABOUT THE AUTHOR

...view details