తెలంగాణ

telangana

ETV Bharat / city

Bus facility: పార్వతి పాట పాడింది.. 'పల్లె వెలుగు' వచ్చింది - Government provided bus facility to Lakkasagaram kurnool district

Bus facility to Parvati's village: పల్లె కోయిల పాటకు పల్లె వెలుగు బస్సు కదిలొచ్చింది. కొన్నేళ్లుగా ఆ కుగ్రామం ఎదుర్కొంటున్న రవాణా కష్టాలకు తెరదించింది. ఊరంతా వెన్నెల అనే గీతంతో ఊరంతా ఆనందం నింపిన ఆమె పాట ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం.

Bus facility to Parvati's village
పార్వతి గ్రామానికి పల్లెవెలుగు బస్సు

By

Published : Feb 22, 2022, 7:33 PM IST

Bus facility to Parvati's village: ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం లక్కసాగరానికి చెందిన పార్వతి.. ఓ టీవీ కార్యక్రమంలో పాటలపోటీలో పాల్గొంది. రంగ్‌దే సినిమాలోని "ఊరంతా వెన్నెల మనసంతా చీకటి " అనే పాట పాడింది. పార్వతి గానామృతానికి, ముగ్దులైన న్యాయ నిర్ణేతలు ఏం కావాలో కోరుకోమని ఆ పల్లె కోయిలమ్మను ఆడిగారు. ఊరి కష్టమే తన కష్టంగా భావించిన పార్వతి.. మా ఊరికో బస్సుంటే చాలు సార్‌.. అంతకుమించి నాకేమీ వద్దని.. వేదికపైనే చెప్పేసింది. సీన్‌ కట్‌చేస్తే.. పార్వతి స్వగ్రామంలో పల్లెవెలుగు బస్సుకు రిబ్బన్‌ కటింగ్‌ జరిగింది.

అధ్వానంగా రోడ్లు

లక్కసాగరం నుంచి హైస్కూల్‌కు గాని, కళాశాలకు గానీ వెళ్లాలంటే 25 కిలోమీటర్ల దూరంలోని డోన్‌కి వెళ్లాలి. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని బస్సులు తిప్పడం మానేశారు. తిరుపతిలో చదువుకున్న పార్వతి ఆ సమయంలో సమయానికి రైలు అందుకోలేక ఇబ్బంది పడిన సందర్భాలు గుర్తుచేసుకుంది. ఒక్కోసారి రైల్వే స్టేషన్‌లోనే నిద్రించి మరుసటి రోజు వెళ్లిన రోజులూ ఉన్నాయని తెలిపింది. ఆ కష్టాలు మరెవరూ పడకూడదనుకున్న పార్వతి.. ఊరికి బస్సు సౌకర్యం కావాలని కోరుకుంది. ఈ వీడియో వైరలై రవాణాశాఖ మంత్రి పేర్ని నానికి చేరింది. ఆ వెంటనే ఆర్టీసీ అధికారులకు ఆదేశాలివ్వడంతో ఊరికి బస్సు వచ్చేసింది. పండగ వాతావరణంలో.. డోన్‌ నుంచి లక్కసాగరానికి బస్సు సర్వీస్‌ మొదలైంది. ప్రముఖ గాయని స్మిత బస్సును ప్రారంభించారు. పార్వతిని అభినందించారు. పార్వతితో పాటు బస్సులో కొంత దూరం ప్రయాణించిన గ్రామస్థులు.. ఇది పల్లెకోయిల తెచ్చిన పల్లెవెలుగు బస్సంటూ సంబరపడిపోయారు.

"చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాల కోర్చి చదువుతో పాటు సంగీతం నేర్చుకుంటూ, అమ్మకు పనుల్లో సాయపడ్డాను. పోటీలో నేడు పాడిన పాటకు న్యాయనిర్ణేతలు సంతోషించి వరం కోరుకోమని అడిగారు. నేను మా ఊరికి బస్సు అడిగాను. వెంటనే ప్రభుత్వం స్పందించింది. నా కోసం ఇక్కడికి వచ్చిన గాయని స్మితకు ధన్యవాదాలు."-పార్వతి, లక్కసాగరం

"తాను పడిన కష్టాలు మరెవరూ పడకూడదనే ఉద్దేశంతో.. తన ఊరి వాళ్ల కోసం పార్వతి బస్సు అడిగింది. తన గురించి ఆలోచించకుండా ఇతరుల గురించి ఆలోచించడం.. ఇదంతా ఆమె గొప్పతనం. పార్వతి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను." -స్మిత, గాయని

లక్కసాగరానికి బస్సు సదుపాయం కల్పించిన ప్రభుత్వం

ఇదీ చదవండి:Etela On CM KCR : 'సీఎంకు తప్ప.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు అధికారాలు ఉండవు'

ABOUT THE AUTHOR

...view details