Government Proposals to Lease RTC Places : ప్రత్యేక సంస్థగా ఉన్న ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వం పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోనుంది. ఇందుకోసం బస్సులు, ఆస్తులు సహా ఆర్టీసీని ఏపీసర్కారే లీజుకు తీసుకునేలా ప్రతిపాదన సిద్ధం చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పటికే ప్రభుత్వంలోని ప్రజా రవాణాశాఖ (పీటీడీ) ఉద్యోగులుగా మారారు. వారికి ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో రోజువారీ రాబడిలో కొంత ఇవ్వాలని ఆర్టీసీని, ప్రభుత్వం కొంత కాలంగా కోరుతోంది. పీటీడీ ఉద్యోగులైన డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది అందరినీ ఆర్టీసీ వినియోగించుకుంటుండగా.. దీనిని సేవల కింద పరిగణించి ఎక్కువ మొత్తం జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది.
వీటన్నింటిపై అధ్యయనం చేసేందుకు కొద్ది రోజుల కిందట ఆర్థిక నిపుణులు, అధికారులతో ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ ఇటీవల అందజేసిన నివేదికలో ఆర్టీసీని ప్రభుత్వం లీజుకు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఆర్టీసీకి ప్రస్తుతం 9,104 సొంత బస్సులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 423 బస్టాండ్లు, 129 డిపోలు, గ్యారేజీలు, 4 జోనల్ వర్క్‌షాపులు, 20 డిస్పెన్సరీలు, ఆసుపత్రులు తదితర ఆస్తులున్నాయి. వీటన్నింటిని మూడేళ్లకు లీజుకు తీసుకునేలా ఏపీప్రభుత్వం.. ఆర్టీసీతో ఒప్పందం చేసుకోనుంది.
నిర్వహణ ఖర్చులు పోను..
Government Proposals to Lease RTC Places : ఈ ఒప్పందం ద్వారా ఆర్టీసీ కార్యకలాపాలు అన్నీ పీటీడీ ద్వారా నిర్వహించనున్నారు. బస్సుల్లో టికెట్ల విక్రయాలు కూడా పీటీడీ తరఫునే జరుగుతాయి. రోజువారీ రాబడి ప్రభుత్వ పరిధిలోకి వెళ్తుంది. ఆర్టీసీ రోజువారీ రాబడి లక్ష్యం రూ.15 కోట్లు కాగా, ప్రస్తుతం రూ.12-13 కోట్ల వరకు వస్తోంది. ఇందులో ఆర్టీసీకి డీజిల్ వ్యయం, నిర్వహణ ఖర్చులకు 60-70 శాతం వరకు ఇచ్చి, మిగిలింది ప్రభుత్వం తీసుకునే వీలున్నట్లు తెలుస్తోంది.