తెలంగాణ

telangana

ETV Bharat / city

రెమిడిసివిర్‌ ఉత్పత్తి నాలుగింతలు.. కృత్రిమ కొరత లేకుండా చర్యలు

కరోనా చికిత్సలో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే రెమిడిసివిర్‌ ఇంజక్షన్‌ ఉత్పత్తి పెరగనుంది. రోజు సుమారు 40వేలకు పైగా ఇంజక్షన్లు ఉత్పత్తి చేసే విధంగా తెలంగాణ ఔషధ నియంత్రణ సంస్థ చర్యలు తీసుకుంది. కొన్ని ఆసుపత్రులు, కొందరు టోకు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో సత్వర చర్యలకు శ్రీకారం చుట్టింది.

REMIDESIVIR
REMIDESIVIR

By

Published : Jul 15, 2020, 6:43 AM IST

కరోనా చికిత్సలో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే రెమిడిసివిర్‌ ఇంజక్షన్‌ ఉత్పత్తి రాష్ట్రంలో త్వరలో నాలుగింతలు కానుంది. ప్రస్తుతం ఒక సంస్థకు మాత్రమే అనుమతి ఉండడంతో.. రోజుకు 8-10 వేల ఇంజక్షన్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. దీన్ని అధిగమించి నిత్యం సుమారు 40వేలకు పైగా ఇంజక్షన్లు ఉత్పత్తి చేసే విధంగా తెలంగాణ ఔషధ నియంత్రణ సంస్థ చర్యలు తీసుకుంది. ఉత్పత్తి అయిన ఇంజక్షన్లను తెలంగాణలో అత్యధిక శాతం వినియోగిస్తుండగా.. కొన్నింటిని ఇతర రాష్ట్రాలకూ సరఫరా చేస్తున్నారని ఔషధ నియంత్రణాధికారులు చెబుతున్నారు. మున్ముందు కేసుల సంఖ్య పెరిగితే అందుబాటులో ఉంటాయో లేదోననే ఆందోళన.. ఎక్కువ ఖరీదుకు విక్రయిస్తారేమోనన్న ఆలోచనతో కొందరు ఈ ఇంజక్షన్లను ఉద్దేశపూర్వకంగానే దాచిపెడుతున్నట్లు ఔషధ నియంత్రణ సంస్థ దృష్టికొచ్చింది. కొన్ని ఆసుపత్రులు, కొందరు టోకు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ నాలుగైదు రెట్ల ధరలకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో సత్వర చర్యలకు శ్రీకారం చుట్టింది.

ఉత్పత్తిలోకి మరో రెండు సంస్థలు

ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న సంస్థను రెట్టింపు స్థాయిలో ఉత్పత్తి చేయాల్సిందిగా ఔషధ నియంత్రణ సంస్థ కోరింది. దీంతో ఆ సంస్థ.. నిత్యం సుమారు 20వేల వరకూ ఇంజక్షన్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. అయితే ఉత్పత్తిని 14 రోజుల పాటు నాణ్యత ప్రమాణాల పరిరక్షణలో భాగంగా ‘స్టెరిలిటీ’ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే అదనపు ఉత్పత్తులు కూడా అందుబాటులోకి రానున్నట్లు ఔషధ నియంత్రణాధికారులు చెప్పారు. దీంతో పాటు మరో రెండు సంస్థలనూ ఉత్పత్తికి అనుమతించింది. అవి కూడా ఒక్కోటి రోజుకు సుమారు 10వేల చొప్పున ఇంజక్షన్లను ఉత్పత్తి చేయనున్నాయి. ఫలితంగా కేసుల సంఖ్య పెరిగినా కొరత అనేది ఉండదని ఔషధ నియంత్రణాధికారులు చెబుతున్నారు. ఎక్కువ సంస్థలు ఉత్పత్తి చేయడం వల్ల ధరలు కూడా తగ్గే అవకాశాలున్నట్లు తెలిపారు. మరో రెండు సంస్థలు కూడా ఉత్పత్తికి కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసుకున్నాయనీ, అక్కడినుంచి అనుమతి లభిస్తే.. రాష్ట్రంలో అవి కూడా ఉత్పత్తిని ప్రారంభిస్తాయని పేర్కొన్నారు.

నేరుగా విక్రయించకూడదు

ఔషధ నిల్వలపై నిఘా కరోనా ప్రాణాధార ఔషధాల కొరతను అధిగమించడంపై దృష్టిపెట్టిన తెలంగాణ ఔషధ నియంత్రణ సంస్థ.. ముందుగా నల్లబజారు అమ్మకాలను నియంత్రించడానికి నిల్వల సమాచారాన్ని తెప్పించుకుంది. ఏయే టోకు వ్యాపారి వద్ద..ఏయే ఆసుపత్రుల వద్ద ఎంత నిల్వ ఉందనే అంశంపై దృష్టిపెట్టింది. ఉత్పత్తి సంస్థల నుంచిగానీ, టోకు వ్యాపారి నుంచి గానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తులకు నేరుగా విక్రయించకూడదని ఆదేశాలు జారీచేసింది. వైద్యుని సూచనల మేరకు రోగి సమాచారాన్ని స్వీకరించి, నేరుగా సంబంధిత ఆసుపత్రికే సరఫరా చేయాలని ఆదేశించింది. ఇక నుంచి రోజూవారీగా రెమిడిసివిర్‌ నిల్వలను, అమ్మకాల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పంపించాలని తెలంగాణ ఔషధ నియంత్రణ సంస్థ సంచాలకులు డాక్టర్‌ ప్రీతిమీనా ఆదేశాలు జారీచేశారు. వచ్చే వారంలో ఉత్పత్తి పెరుగుతుందనీ, అప్పుడు బాధితులకు రెమిడిసివిర్‌ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడితే.. ఈ ఔషధం కొరత ఉండదన్నారు. ‘టోసిలిజుమాబ్‌ ఇంజక్షన్‌’ను ప్రస్తుతం ఒక్క సంస్థ మాత్రమే సరఫరా చేస్తోందనీ, ఈ ఔషధాన్ని కృత్రిమ కొరత సృష్టించకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి :కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ

ABOUT THE AUTHOR

...view details