Non Cultivation Lands Survey: వ్యవసాయ భూముల్లో సాగుకు యోగ్యం కాని భూములు, షెడ్లు, భవనాలు, గుట్టలకు సంబంధించిన వివరాలను రెవెన్యూ దస్త్రాలు, ధరణిల నమోదుకు చర్యలు చేపట్టాలని ఆర్డీవోలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. చెరువులు, ముంపులో ఉన్న భూములు, కట్టలు, కాల్వలు, వాగులు, ప్రైవేట్ అటవీ భూములు.. వరదలతో సాగు చేయని విధంగా మారినవి, వరదనీటి కాల్వలు తదితర భూముల వివరాలను అధికారులు నమోదు చేయనున్నారు.
సేత్వార్ ప్రకారం ఫూట్ ఖరాబ్ భూముల జాబితాలో వాటిని చేర్చనున్నారు. అలాంటి భూములున్న యజమానులు ఆర్డీవోలకు దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఆ భూములను గుర్తించనున్నారు. ఆనంతరం ధరణిలో చేర్చి పాసుపుస్తకాల నుంచి ఆ మేరకు విస్తీర్ణం తొలగించనున్నారు.