రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. భూములకు సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న రికార్డులన్నీ అప్పగించాలని ఆదేశించింది. ఈ మేరకు భూ పరిపాలన చీఫ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. భూ రికార్డులు సహా పత్రాలన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్‌లను ఆదేశించారు. ఫొటో కాపీలు, చేతి రాత రికార్డులు, ముద్రిత కాపీలు అన్నింటిని స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేశారు. పహాణీలు, పంపిణీ చేయని పీపీబీలు, టిప్పన్లు, గ్రామ పటాలు, ఫారం 1-బి ఇలాంటి దస్త్రాలన్నీ తహసీల్దార్లకు అప్పగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గ్రామాల వారీగా జాబితాలు రూపొందించి.. ఓ ఫార్మాట్ ప్రకారం.. రికార్డులన్నీ స్వాధీనం చేసుకున్నామని తహసీల్దార్లు ధ్రువీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తదుపరి సూచనల వరకు రికార్డులను సురక్షితంగా భద్రపరచాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని.. పర్యవేక్షణకు కలెక్టర్లందరూ ప్రత్యేక అదనపు సీనియర్ జిల్లా అధికారులను నియమించాలని ఉత్తర్వుల్లో కోరారు.
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిపివేస్తూ ఉత్తర్వులు
రికార్డుల స్వాధీన ప్రక్రియకు ఆదేశించిన ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా వెన్వెంటనే మరో నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించే చర్యల్లో భాగంగా సాంకేతికపరమైన మార్పులు, చేర్పులకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వుల్లో వెల్లడించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ చట్టం నిబంధన-5 ప్రకారం.. మంగళవారం నుంచి... తిరిగి కొత్త ఉత్తర్వులు ఇచ్చే వరకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే 'ఈ-స్టాంపులు' కొనుగోలు చేసి, చలానాలు చెల్లించిన వారికి ఒక్కరోజు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ చిరంజీవులు తెలిపారు. ఈ-స్టాంపులకు సంబంధించిన విక్రయాలు పూర్తిగా నిలిపివేశామని వెల్లడించారు.