ఆంద్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన రీ-సర్వేలో కొత్త చిక్కులతో పాటు అధికారులకే తెలియని వివరాలు బయటపడుతున్నాయి. ఈ సర్వేలో అధునాతన సాంకేతికతతో సరిహద్దులను నిర్ణయిస్తున్నారు. తక్కెళ్లపాడు, రామచంద్రునిపేటలో కార్ పద్ధతిలో సర్వే చేస్తుండగా జయంతిపురం, తిరుమలగిరి, గౌరవరం, త్రిపురవరంలో డ్రోన్ పద్ధతి అవలంభిస్తున్నారు.
రామచంద్రునిపేటలో ఓ రైతు సాగుచేస్తున్న భూమి దేవాదాయశాఖకు చెందిందని తేలింది. ఈ విషయం ఆ శాఖాధికారులకే ఇంతవరకూ తెలియకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అదే గ్రామంలో వారసత్వంగా వచ్చిన భూపంపకాల్లో ఒకరికి 4.59 ఎకరాలుండగా మరొకరికి 4.29 ఎకరాలే ఉంది. రికార్డుల్లో మాత్రం సరిసమానంగా ఉన్నట్టు వారు చెబుతున్నారు. ఇది దాయాదుల మధ్య కొత్త గొడవకు దారితీసింది. దీని పరిష్కారం అధికారులకు పెద్ద సమస్యగానే మారింది. కొన్నిచోట్ల దస్తావేజుల్లో ఉన్నదాని కన్నా వాస్తవంలో స్థల విస్తీర్ణం తక్కువగా ఉందని అధికారులు చెబుతుంటే.... ఏం చేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.