కొత్త సచివాలయాన్ని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించేందుకు అనువైన ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించి వివిధ సంస్థలు, నిపుణులతో సీఎం కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. మంత్రివర్గ ఉపసంఘం, సాంకేతిక నిపుణుల కమిటీలు ముఖ్యమంత్రితో భేటీ అవుతున్నాయి. నిర్మాణాల విషయంలో కీలక అంశాలపై ఇప్పటికే స్పష్టత వచ్చినట్లు తెలిసింది.
పచ్చదనానికి పెద్దపీట
సచివాలయాన్ని నికరంగా 25 ఎకరాల్లో నిర్మించనుండగా.. అందులో 5 ఎకరాల్లో భవనాలుంటాయి. సర్వహంగులతో నిర్మించే ప్రధాన భవనాలకు తోడు సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్ హాలు, క్యాంటీన్, జిమ్నాజియం, గ్రంథాలయం, విదేశీయుల కోసం కేఫెటేరియా వంటివి ఉంటాయి. మిగిలిన 20 ఎకరాల విస్తీర్ణంలో ఎక్కువ భాగంలో మొక్కలు నాటి పచ్చికబయళ్లను ఏర్పాటు చేస్తారు. చుట్టూ ఉద్యానవనం, మధ్యలో వాటర్ ఫౌంటేన్లు ఉంటాయి. స్వచ్ఛమైన ప్రాణవాయువు అందించే జోన్‌గా సచివాలయ పరిసరాల్ని తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష. నిర్మాణంలో అన్ని రకాల నిబంధనలు పాటించడంతోపాటు జాగ్రత్తలు, అనుమతులు తీసుకోనున్నారు. వీటికి అనుగుణంగా ఆర్కిటెక్టులకు సూచనలు ఇచ్చారని తెలుస్తోంది.
విశాలమైన పార్కింగ్ సదుపాయం
సచివాలయ నిర్మాణంలో జాతీయ భవన, హరిత నిబంధనలను పక్కాగా పాటిస్తారు. హుస్సేన్‌సాగర్ సమీపంలో నిర్మాణాలు జరుపుతున్నందున పర్యావరణ ప్రమాణాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అగ్నిమాపక నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తారు. సచివాలయానికి రోజూ 1000కి పైగా వాహనాలు వస్తుంటాయి. ఇందుకు అనుగుణంగా విశాలమైన పార్కింగ్ స్థలం సమకూరుస్తారు. రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లుంటాయి. భవన ప్రణాళికలనుగుణంగా ప్రస్తుతం సచివాలయంలో ఉన్న ఆలయం, మసీదు, చర్చిల నిర్మాణాలపై నిర్ణయం తీసుకుంటారు.