రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు ఔషధాలు, టీకాలను వేగంగా చేరవేయడానికి త్వరలో డ్రోన్లను వినియోగించనున్నారు. ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’(Medicine from the Sky) అనే ప్రాజెక్టును రాష్ట్రంలో అమలుచేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరహా ప్రయోగం దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో అమలు కానుందని వైద్యవర్గాలు తెలిపాయి. ఈనెల 9 నుంచి అక్టోబరు 10 వరకు వికారాబాద్ జిల్లాలో దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో స్కై మెడిసిన్స్ కార్యక్రమ ఏర్పాట్లను వికారాబాద్‌లో మంత్రి సబితారెడ్డి పరిశీలించారు. వికారాబాద్ ఎస్పీ కార్యాలయం పరేడ్ గ్రౌండ్స్‌లో కలెక్టర్ నిఖిల సమక్షంలో ప్రయోగాత్మక పరీక్షను నిర్వహించారు. రెండు రోజులపాటు ప్రక్రియ పరిశీలించిన అనంతరం.. శనివారంనాడు కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, రాష్ట్ర మంత్రి కేటీఆర్ డ్రోన్ మెడిసిన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
మారుమూల పల్లెలకు
తొలిరోజు వికారాబాద్ జిల్లాలో 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్‌ల ద్వారా మందులు పంపిణీ చేయనున్నారు. రవాణా ఇబ్బందులు లేకుండా, అటవీ ప్రాంత ప్రజలకు ఔషధాలు అందించడానికి కార్యక్రమం దోహదపడుతుంది.మారుమూల పల్లెలకు, హెల్త్ సెంటర్లకు అత్యవసర సమయంలో వ్యాక్సినేషన్, ఇతర అత్యవసర ఔషధాలు అందించడం సులభతరం కానుందని జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. డ్రోన్ 140మీటర్ల ఎత్తు వరకు ఎగురవేసేందుకు అనుమతులు ఉన్నాయని వెల్లడించారు.