తెలంగాణ

telangana

ETV Bharat / city

భూముల అమ్మకం, కేంద్రం నుంచి గ్రాంట్లపై ప్రభుత్వం ఆశలు - telangana budget 2020-21 news

భూముల అమ్మకం, కేంద్రం నుంచి గ్రాంట్లపై రాష్ట్ర ప్రభుత్వం మరోమారు భారీగా ఆశలు పెట్టుకొంది. 2021-22లో భూముల అమ్మకం ద్వారా 16వేల కోట్ల రూపాయలు, కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ, అదనపు గ్రాంట్ల కింద పాతికవేల కోట్లు వస్తాయని అంచనా వేసింది. ఆ మేరకు బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించింది

Government hopes on sale of lands, grants from the Center for budget 2020-21
భూముల అమ్మకం, కేంద్రం నుంచి గ్రాంట్లపై ప్రభుత్వం ఆశలు

By

Published : Mar 18, 2021, 7:59 PM IST

వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా 92వేల 910 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మిగతా నిధులను కేంద్రం నుంచి వాటాతో పాటు పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే ప్రత్యేక ప్యాకేజీ, అదనపు గ్రాంట్ల ద్వారా సమకూర్చుకోవాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగానే బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించింది.

2021-22 బడ్జెట్‌లో పన్నేతర ఆదాయాన్ని 30వేల557 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించింది. అందులో ఆర్థిక సేవల ద్వారా 4446 కోట్లు, సామాజిక సేవల ద్వారా మరో 9043 కోట్లు సమకూరుతాయని అంచనా వేసింది. ఇక భూములు, ఆస్తుల అమ్మకం ద్వారా 16వేల కోట్ల రూపాయలు సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఓ రకంగా చెప్పాలంటే ఇది పెద్ద లక్ష్యంగానే చెప్పుకోవచ్చు.

భూముల అమ్మకం ద్వారా కనీసం 10వేల కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని ప్రభుత్వం మూడు, నాలుగేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. అయితే వివిధ కారణాల రీత్యా అది సాధ్యపడడం లేదు. 2019-20లో భూముల అమ్మకం ద్వారా 415.59 కోట్లు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. 2020-21లో 14వేల294.42కోట్లు అంచనా వేయగా... 3వేల కోట్లకు సవరించింది. కరోనా కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భూముల అమ్మకాన్ని చేపట్టేలేదని... వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. కొన్ని భూములకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు వీడడంతో అమ్మకానికి అడ్డంకులు తొలిగాయని, రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ పరిసరాల్లో స్థిరాస్తి వ్యాపారం బాగా పుంజుకోవడంతో భూములకు రికార్డు ధరలు వస్తాయని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మారు భూముల అమ్మకం ద్వారా 16వేల కోట్లు సమీకరించుకోవాలని ప్రతిపాదించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

కేంద్రం నుంచి వచ్చే మొత్తం గ్రాంట్లు 38వేల 669.46కోట్లుగా ప్రతిపాదించింది. 2019-20లో రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్లు 11వేల598.42 కోట్లు కాగా... 2020-21లో వచ్చిన గ్రాంట్లు 10వేల 525.36 కోట్ల రూపాయలు. ఈ మారు ప్రత్యేక ప్యాకేజీ, అదనపు కేంద్ర సహాయక గ్రాంట్ల కింద 25వేల 105 కోట్ల రూపాయలు వస్తాయని ప్రభుత్వం ప్రతిపాదించింది.

జీఎస్టీ పరిహారానికి సంబంధించి రాష్ట్రానికి నాలుగు నుంచి ఐదు వేల కోట్లు వస్తాయని, ఐజీఎస్టీ బకాయిలు కూడా రావాల్సి ఉందని ప్రభుత్వం చెబుతోంది. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఇచ్చే నిధులు రెండేళ్ల బకాయిలు మరో వెయ్యి కోట్ల రూపాయలు రావాల్సి ఉందని చెబుతోంది. వీటితో పాటు ఇతరత్రాలకు సంబంధించి కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ, అదనపు గ్రాంట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశావహ ధృక్పథంతో కనిపిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details