తెలంగాణ

telangana

ETV Bharat / city

సమగ్ర భూసర్వే కోసం మార్గాలు అన్వేషిస్తున్న సర్కారు - భూసమస్యల పరిష్కారానికి సమగ్ర సర్వే

రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం... సమగ్ర సర్వే చేపట్టడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తోంది. యంత్రాంగం దీనిపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా చట్టం రూపొందించాల్సిన అవసరమేదీ లేదని, కేవలం నోటిఫికేషన్‌ ద్వారా పునః సర్వే చేయడానికి వీలుంటుందని భూ చట్టాల నిపుణులు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం.

Government exercise towards comprehensive survey for solution of land issues
Government exercise towards comprehensive survey for solution of land issues

By

Published : Feb 22, 2021, 4:22 AM IST

సమగ్ర భూ సర్వే చేపట్టి... ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తోంది. సర్వే చేపట్టేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. సర్వేకు సంబంధించిన చట్టం కొత్తగా రూపొందించాలా.. పాత చట్టాలే వర్తిస్తాయా అనేదానిపై అనుమానాలేవీ అవసరం లేదని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. పాత చట్టాన్ని అనుసరించి ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయంటున్నారు.

తెలంగాణ సర్వే, భూమి సరిహద్దుల చట్టం-1923 ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టడానికి ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి. చట్టంలో ఉన్న వెసులుబాటు ప్రకారం సర్వే చేయనున్న ప్రాంతానికి సంబంధించి ప్రకటన విడుదల చేస్తారు. దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించాలి. అప్పుడే స్పష్టత వస్తుంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు అందితే మార్గదర్శకాలు సిద్ధం చేసే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం గత ఏడాది చివరలో ఆర్వోఆర్​ - 1971 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసి తెలంగాణ భూములు, పాసుపుస్తకాల చట్టం-2020 రూపొందించింది. దీని ప్రకారం ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సంస్కరణలకు కొనసాగింపుగా సమగ్ర భూ సర్వేకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.


రాష్ట్రంలో ధరణి పోర్టల్‌కు బయట ఉన్న భూ ఖాతాలు, విస్తీర్ణం విషయంలో కొంత కాలంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2017లో భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించిన అనంతరం స్పష్టత లేని భూములను ప్రభుత్వం పార్ట్‌-బీ పేరుతో పక్కన పెట్టింది. అప్పటి నుంచి వాటి యజమానులకు రైతుబంధు, బీమాతోపాటు రుణాలు ఏవీ మంజూరు కావడం లేదు. ఇలా దాదాపు 17 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. పాసుపుస్తకాలు వచ్చిన రైతులకు కొందరికి విస్తీర్ణాల్లో తేడాలు నమోదయ్యాయి. కొందరి సర్వే నంబర్లు గల్లంతయ్యాయి. 9 లక్షల 80 వేల మంది సాదాబైనామాలతో భూములు కొని సాగులో ఉన్నారు. మొదట ఇలాంటి రైతుల భూముల్లో సమగ్ర సర్వే నిర్వహిస్తే ఇన్నాళ్లు హక్కులు లేని వారికి పరిష్కారం దొరుకుతుందన్న అభిప్రాయం ఉంది.

వాస్తవానికి మొదట సమస్యలున్న భూముల్లో సర్వే చేయాలని అనుకున్నా... రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో గ్రామాల వారీగా నిర్వహించనున్నట్లు సమాచారం. దీనికోసం అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతతో ప్రైవేటు సంస్థలకు బాధ్యతలు అప్పగించనున్నారు. గుత్తేదారు సంస్థలు ఖరారైతే సర్వే పూర్తి చేయడానికి మూడు నుంచి ఆరు నెలల వ్యవధి పట్టే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.


ఇదీ చదవండి:నడ్డా సమక్షంలో భాజపాలో చేరిన శ్రీశైలం గౌడ్‌

ABOUT THE AUTHOR

...view details