Land Survey in Telangana : రాష్ట్రంలో భూ విస్తీర్ణాలకు సంబంధించి దస్త్రాల్లో స్పష్టత ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో తప్పులతో నమోదవడంతో క్షేత్రస్థాయిలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. వీటిపై జిల్లా కలెక్టరేట్లకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో భూ సంస్కరణలను 2020 అక్టోబరు నుంచి అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం సర్వేపై మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. టైటిల్ డీడ్ లాంటి చట్టం అమలు చేయాలని భావిస్తున్నప్పటికీ సర్వేకు ముందడుగు పడడం లేదు. ప్రస్తుతం పోర్టల్ ద్వారా రెవెన్యూ దస్త్రాల్లో ఉన్న సమాచారం ప్రకారం డిజిటల్ లావాదేవీలను నిర్వహిస్తోంది. క్షేత్రస్థాయితో సంబంధం లేకుండా జరుగుతున్న ఈ లావాదేవీలు మరిన్ని సమస్యలు సృష్టిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో భూమి ఉందో లేదో పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్‌తో పాటు యాజమాన్య హక్కు మార్పిడి (మ్యుటేషన్) పూర్తిచేయడమే దీనికి కారణమని చెబుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో భూ భారతి పేరిట 2005లో జాతీయ భూ దస్త్రాల ఆధునికీకరణ కార్యక్రమం (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ- భూ భారతి) కింద ఏరియల్ ఫొటోగ్రఫీ సర్వే నిర్వహించారు. అందులో తొమ్మిది లక్షల మంది రైతుల భూములు సర్వే చేస్తే దాదాపు 11 వేల మంది నుంచి అభ్యంతరాలు వచ్చాయి. వాటిపై మరోసారి సర్వే చేయగా తేలిన దాదాపు వెయ్యి వ్యత్యాసాలను అధికారులు సరిచేశారు. ఈ లెక్కన రాష్ట్రంలో ఉన్న 2.45 కోట్ల ఎకరాల భూమిని సర్వే చేస్తే చాలా అభ్యంతరాలొస్తాయని సర్వే రంగ నిపుణులు చెబుతున్నారు. రెండు మూడు దశల్లో సర్వే చేస్తే వాటిని పరిష్కరించవచ్చని సూచిస్తున్నారు.
యథేచ్ఛగా ఉప సంఖ్యల సృష్టి..