కొత్త జిల్లాల ఏర్పాటుపై 16 వేలకు పైగా అభ్యంతరాలు. New Districts in AP : కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో పలుచోట్ల పెద్దఎత్తున అభ్యంతాలు వ్యక్తమైనా ఏపీ ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల అభ్యర్థనలన్నీ బేఖాతర్ అయ్యాయి. చాలా తక్కువ ప్రతిపాదనలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. చాలా చోట్ల ప్రజలు చేసిన ఆందోళనలు, ఉద్యమాలకు అర్థం లేకుండాపోయింది.
కొత్త జిల్లాలు ఏర్పాటుపై ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం... ప్రజల నుంచి అభ్యంతరాలు కోరింది. సూచనలు, సలహాలు, ఫిర్యాదులు, అభ్యంతరాలను తెలియ జేయాలని ఆహ్వానించింది. నెల రోజుల పాటు వారినుంచి అభిప్రాయాలను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల 600 పైగా అభ్యంతరాలు వ్యక్తమైనట్లు అధికారులు తెలిపారు. ప్రజలు లేవనెత్తిన పలు సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపలేదు. ప్రజలు తెలిపిన అభిప్రాయాలను పట్టించుకోలేదు. జిల్లా పేరు మార్పు, సహా జిల్లా కేంద్రాల మార్పు తదితర అంశాలను కనీసం పట్టించుకోలేదు. ఫలితంగా పలు జిల్లాలో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగినా.. ఆ డిమాండును పరిగణనలోకి తీసుకోలేదు. మదనపల్లెను జిల్లా కేంద్రం చేయాలన్న డిమాండ్‌తో అక్కడ ఐకాస ఉద్యమించింది. అయినా పట్టించుకోలేదు. రంపచోడవరం పరిధిలోని 11 ఏజెన్సీ మండలాలతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండును ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆదోని కేంద్రంగా జిల్లా కావాలన్న డిమాండును పరిగణలోకి తీసుకోలేదు.
జిల్లా కేంద్రం మార్చాలని కోరినా వాటినీ పట్టించుకోలేదు. రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటుచేశారు. ఆ జిల్లాకు రాజంపేటను కేంద్రంగా చేయాలని డిమాండు చేస్తూ అధికార పార్టీ నేతలు, స్థానికులు పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగించారు. 7వేలకు పైగా వినతులు అందాయి. అయినా.. రాయచోటినే జిల్లా కేంద్రంగా చేశారు. భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లాను ఏర్పాటుచేశారు. నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని స్థానిక ప్రజా ప్రతినిధులు, వైకాపా నేతలు ఆందోళన చేశారు. కానీ భీమవరాన్నే కొనసాగించారు. పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ఏర్పాటుచేశారు. హిందూపురాన్ని ఈ జిల్లాకు కేంద్రంగా మార్చాలని తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, స్థానిక ప్రతినిధులు ఆందోళన చేశారు. అయినా పుట్టపర్తినే కొనసాగించారు. నర్సీపట్నం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండును పరిగణనలోకి తీసుకోలేదు. అనకాపల్లినే జిల్లా కేంద్రంగా కొనసాగించారు.
ప్రభుత్వానికి , ప్రజాప్రతినిధులకు ఇచ్చిన వినతులను ప్రభుత్వం లెక్కచేయలేదు. మైలవరం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని వేలసంఖ్యలో విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందాయి. అయినా మైలవరం డివిజన్‌ను ఏర్పాటు చేయలేదు. పెందుర్తి నియోజకవర్గం మొత్తాన్ని విశాఖ జిల్లాలో కలపాలనే డిమాండు పట్టించుకోలేదు. విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని S.కోట అసెంబ్లీ నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో కలపాలనే డిమాండు ఉన్నా, విజయనగరం జిల్లాలోనే కొనసాగించారు. విజయవాడకు ఆనుకుని ఉన్న పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను విజయవాడలోనే కలపాలని డిమాండు ఉంది. కానీ వాటిని మచిలీపట్నం కేంద్రంగా ఏర్పాటైన కృష్ణా జిల్లాలోనే కొనసాగించారు. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని భారీగా ఆందోళన చేసినా..ఫలితం లేకపోయింది.