స్థిరాస్తుల వివరాలన్నీ ఒకే వేదికపైకి తెచ్చి అవినీతిని నిర్మూలించే లక్ష్యంతోనే ధరణిని రూపొందించినట్లు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ధరణిలో ఆస్తుల నమోదు ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజనాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్ సోమేష్ కుమార్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ప్రజల వ్యక్తిగత ఆస్తుల హక్కులను పరిరక్షించేందుకు తీసుకొచ్చిన పరిపాలన సంస్కరణల్లో భాగమే ధరణి అని ప్రభుత్వం వివరించింది. ధరణి డిజిటల్ వేదిక వల్ల రిజిస్ట్రేషన్లు, ఆస్తి మార్పిడిలో మోసాలు, అవినీతి ఆస్కారం ఉండదని పేర్కొంది. అధికారులకు విచక్షణ అధికారం ఉండదని తెలిపింది. ధరణిలో రాష్ట్రవ్యాప్తంగా కోటి 6 లక్షల ఆస్తుల నమోదు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. ధరణి ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్, ఆస్తి మార్పిడికి చట్టబద్ధత కోసం రెవెన్యూ, పంచాయతీ, పురపాలక, జీహెచ్ఎంసీ చట్టాలకు సవరణ చేసినట్లు ప్రభుత్వం నివేదించింది.
ఆధార్ వివరాలు తప్పనిసరేమీ కాదు...
ధరణిలో కులం వివరాలు అడగమని.. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి సామాజిక వర్గాల వివరాలు మాత్రమే నమోదు చేస్తామని తెలిపింది. వ్యవసాయేతర ఆస్తుల యజమానులు ఆధార్ వివరాలు ఇవ్వడం తప్పనిసరేమీ కాదని.. ఐచ్ఛికమేనని స్పష్టత నిచ్చింది. సాగునీటి భూముల యజమానులు మాత్రం కచ్చితంగా ఆధార్ వివరాలు ఇవ్వాల్సిందేనని తెలిపింది. వ్యవసాయ భూములకు రైతుబంధు వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందున.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆధార్ వివరాలు అడగటం తప్పేమీ కాదని వివరించింది. వ్యక్తిగత వివరాలు అందరికీ కనిపించకుండా దాచుకోవడానికి కూడా ధరణిలో ఆప్షన్ ఉందని పేర్కొంది.