కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లాక్ డౌన్... రాత్రి కర్ఫ్యూ పెడతారని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటివరకైతే లాక్ డౌన్, కర్ఫ్యూ ప్రతిపాదన లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బడులు, వసతి గృహాల్లో విద్యార్థులు కరోనా బారిన పడుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
పాఠశాలలు కొనసాగింపుపై త్వరలో ప్రకటన చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల శాససనభలో చెప్పినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల్లో కొనసాగుతున్న ప్రత్యక్ష బోధన, తీసుకున్న జాగ్రత్తలు, కరోనా కేసుల వివరాలను ఇటీవల విద్యా శాఖ అధికారుల నుంచి తెప్పించుకున్నారు. ఆరు నుంచి ఎనిమిది వరకు తరగతులు ముగించి ప్రమోట్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. తొమ్మిది, పది తరగతులకు పరీక్షలు ముగిసే వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు తరగతులైతే.. భౌతిక దూరం పాటించేందుకు గదుల సమస్య ఉండదని.. ఇష్టం లేని వారికి ఆన్ లైన్ బోధన కూడా కొనసాగుతుందని వివరించినట్లు తెలుస్తోంది.