రాష్ట్రంలో వానాకాలంలో సాగైన వరి ధాన్యం, పత్తి పంటలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మొత్తం ఆరువేల కొనుగోలు కేంద్రాల ద్వారా వరిధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పంటలకు పెట్టుబడి ఇవ్వడం మొదలు కొనుగోళ్ల వరకు ప్రతి విషయంలోనూ రైతులను కాపాడుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం తెలిపారు.
'తొందరపడి అమ్ముకోవద్దు... మొత్తం మేమే కొంటాం' - monsoon paddy sales
18:45 October 06
'తొందరపడి అమ్ముకోవద్దు... మొత్తం మేమే కొంటాం'
వానాకాలం పంటల కొనుగోలు అంశంపై మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్లో సమీక్షించారు. రాష్ట్రంలో ఈ వానాకాలం రికార్డుస్థాయిలో కోటీ 34 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని... 52 లక్షలకు పైగా ఎకరాల్లో వరి, 60 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి, పది లక్షలకు పైగా ఎకరాల్లో కంది సాగైందని తెలిపారు. ఐకేపీ కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల వరిధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని తెలిపారు.
రైతులు తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దన్న సీఎం... 17శాతం లోపు తేమతో ఉన్న వరిధాన్యం ఏ-గ్రేడ్ రకానికి 1888, బీ-గ్రేడ్ రకానికి 1868 కనీస మద్దతు ధరను ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. తాలు, పొల్లు లేకుండా ఎండబోసిన వరిధాన్యాన్ని తెచ్చి కనీస మద్దతు ధర పొందాలన్న కేసీఆర్... తేమ ఎక్కువున్న ధాన్యాన్ని తెచ్చి ఇబ్బంది పడవద్దని రైతులకు సూచించారు. వరిధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో మార్గదర్శకాలు విడుదలవుతాయని... వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
పత్తిని కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పూర్తిగా కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ విషయమై సీసీఐతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామన్న ఆయన... రైతుల సందేహాలను కాల్ సెంటర్ ద్వారా నివృత్తి చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి:ఆ రెండు ప్రాజెక్టుల నిర్వహణ మాకే ఇవ్వాలి: కేసీఆర్