ఉన్నత విద్యా సంస్థ(హెచ్‌ఈఐ)లు స్వతంత్రంగా వ్యవహరించేందుకు పాలక మండళ్ల(బోర్డు ఆఫ్ గవర్నర్లు- బీఓజీ)ను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ నూతన విద్యావిధానంలో విద్యాసంస్థల్లో ప్రభావవంతమైన పాలన, నాయకత్వంపై పలు అంశాలను పొందుపరిచారు. రానున్న 15 సంవత్సరాల్లో దేశంలోని 45 వేల డిగ్రీ/పీజీ కళాశాలలను 15 వేలకు కుదించి.. న్యాక్ గ్రేడ్‌ను బట్టి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. వాటికి పాలక మండళ్లను ఏర్పాటు చేసి అర్హులైన ప్రతిభావంతులను నియమిస్తారు. వీటి వల్ల కళాశాలలకు స్వయం ప్రతిపత్తి కలిగి ప్రభుత్వ జోక్యం లేకుండా నియామకాలు, పాలన సంబంధిత అంశాల్లో సంపూర్ణాధికారం ఒనగూరనుందని నిపుణులు భావిస్తున్నారు.
బోర్డే జవాబుదారీ
విద్యాసంస్థకు సంబంధించి బీఓజీ జవాబుదారీగా వహించాల్సి ఉంటుంది. సంస్థ రికార్డులను పారదర్శకంగా ఉంచాలి. బోర్డు సభ్యులు, విద్యాసంస్థల నాయకులు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది కలిసి సంస్థ అభివృద్ధి ప్రణాళిక(ఐడీపీ) రూపొందించి పురోగతి, లక్ష్యాలు తదితరాలను పొందుపరచాలి. బయట వ్యక్తులు, వ్యవస్థల ప్రభావం లేకుండా విద్యాసంస్థను స్వేచ్ఛగా నడపాలి. విద్యాసంస్థ అధిపతి సహా అన్ని నియామకాలను బోర్డే చేపట్టాలి.