తెలంగాణ

telangana

ETV Bharat / city

Gorati venkanna: 'ఆ పుస్తకం చదివిన ప్రతిసారీ ఓ కొత్త ఉత్తేజం'

పల్లె ఆత్మకు పాటగట్టి మనిషి మూలాలను తట్టిలేపిన వాగ్గేయకారుడు గోరటి వెంకన్న. ఆయన పాటలో మానవత్వం పరిమళిస్తుంది. జానపదం జీవ నాదంలా పలుకుతుంది. మట్టి వాసన మనసుని ఆర్ద్రం చేస్తుంది. అందుకే ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆయనను వరించింది. పల్లె బతుకు నాదాన్నే తన ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలుగా మార్చుకున్న ఈ కవిగాయకుడు విరామ సమయం దొరికితే చేస్తారో ఆయన మాటల్లోనే...

By

Published : Dec 30, 2021, 6:13 PM IST

Gorati venkanna
గోరటి వెంకన్న

Gorati venkanna:ఇటీవల కొవిడ్​ కారణంగా విరామ సమయం ఎక్కువగానే దొరికింది. ఆ ఖాళీ సమయంలో అక్షరానికి పూర్తిగా అంకితమయ్యాను. మేరీ టేలర్‌ ‘భారతదేశంలో నా జైలు జీవితం’, ముదిగొండ వీరభద్రయ్య ‘విమర్శ కళా దృక్పథం’, కె.శ్రీనివాస్‌ ‘తెలంగాణ సాహితీ వికాసం’, కోవెల సుప్రసన్నాచార్య వ్యాసాలు చదివాను. టేలర్‌ పుస్తకం గుండెని పిండేస్తుంది. మనిషి కేవలం ఒక భావాజాలానికే బందీ అయిపోకుండా అన్నింటినీ అవగాహన చేసుకోవాలని ముదిగొండ చెబుతారు.

అదో ఉత్తేజం

శ్రీకృష్ణదేవరాయల ఆముక్త మాల్యద కూడా తిరగేశాను. చదివిన ప్రతిసారీ పల్లె సీమ అందాన్ని కొత్తగా చూపించే పుస్తకమిది. ఇందులో ఒక పద్యం ఉంటుంది. వేద పండితులు కొలనులో స్నానం చేస్తున్న సమయంలో హంసలు వచ్చి వాలాయట. పండితులు వెళ్లిపోయాక నీటి మీద తేలాడుతున్న హంసలను వారి పంచెలుగా భావించి తిరిగి అప్పగించాలని కావలివాళ్లు కొలనులో దిగితే అవి ఎగిరిపోయాయట. దాన్ని చూసి నీళ్లకోసం వచ్చిన పడతులు కిలకిలా నవ్వారట. ఎంత మనోహరమైన వర్ణన ఇది! కవిత్వం రాయాలనుకున్న ప్రతిసారీ ఆముక్తమాల్యదను చదివితే ఓ కొత్త ఉత్తేజం. మహాకవుల రచనలు మనలో భావుకతను పెంచుతాయి. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా ప్రారంభంలో రాసిన రచనలూ చదువుతున్నాను. వీటిని చదివిన ప్రతిసారీ ఓ గొప్ప అనుభూతి. పోతన భాగవత పద్యాలూ చదివాను. భావుకతలో ఇవి అద్భుత రసగుళికలు. కృష్ణశాస్త్రి, కేశవరెడ్డి, నామినిల రచనలు ఒక్క పుట అయినా చదవందే నాకు రోజు గడవదు.

ఆ పాపమే పండి...

ప్రస్తుత కల్లోలాన్ని చూస్తే జాషువా రాసిన సత్యహరిశ్చంద్ర కాటిసీనులోని ‘ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము...’ లాంటి పద్యాలు గుర్తొస్తాయి. అలాగే ‘ఫిరదౌసి’లో దుఃఖంతో చెప్పిన పద్యాలు, పాలగుమ్మి ‘గాలివాన’ కథ, కేశవరెడ్డి ‘శ్మశానం దున్నేరు, చివరి గుడిసె’ నవలలు, కబీర్, అక్కమహాదేవి మాటలు స్ఫురణకొస్తాయి. ఇది మనిషి స్వయంగా కొనితెచ్చుకున్న విధ్వంసం. ప్రస్తుతం అన్ని జీవులూ బాగున్నాయి. మానవుడొక్కడే ఎందుకిలా ఏడుస్తున్నాడు? ఈ విషయాన్ని తెలియజెబుతూ ఇటీవల ‘గాలి తుంగబుర్ర’ పేరుతో గేయం రాశాను.

‘‘వినకపోతివి గదర ఎరుక గలిగిన పదము/ కొరివి కొనిదెచ్చుకొని వణికితేమీ ఫలము/ దయ్యమోలె నిన్ను పట్టుకున్నది ధనము/ యుగములే గడిచినా మారదే నీ గుణము/ కొమ్మ కుంకుమపూల అడవి సుగంధాల/ చిదిమి పాదులను నరికి పారించితివి మురికి/ ఆ పాపమే పండి నీకిట్ల అయ్యింది/ తుంటె పురుగుకన్న నీ చేయె విషమంట/ ఆ చేతులకె పుట్టెగద ఈ విషపు తుట్టె/ ఆశ లేని మనిషి అడివి మునివలె ఉండె/ సిరి మరిగి నగరికుడు ఉరిబోసుకొనుచుండె’’ ఇలా సాగుతుందిది.

నా మాట ఒక్కటే... ‘‘ఎగువ తిరుపతులు దిగువ తిరుపతులు/ నీలోనె వెలుగొందుచున్నవి యాత్రలిక వద్దు/ కనుపాపలో మక్కా అజ్మీరులున్నవి/ జమయత్‌లు ఎందుకు జపము‌ చాలు/ గాటి ఎద్దువోలె మతిని గుంజి కట్టు/ కాసె పున్నమి కాంతి నీలోపలనె పుట్టు/ ... కనుకొలుకులో కరుణ తొణుకులాడుచు/ పరుల సేవించె వైద్యులకు దోసిలొగ్గు/ చిరునవ్వుతో సిరుల కుదురైన పల్లెకు మళ్లి బాటబట్టు’’... మనిషి తన అత్యాశను వదులుకుని మళ్లీ ప్రకృతి బాట పడితేనే భవిత.! అని గోరటి వెంకన్న చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి:Gorati Venkanna: ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

ABOUT THE AUTHOR

...view details