ఏపీలోని విశాఖ బీచ్ రోడ్డులో భూగర్భ మార్గం నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైంది. వాహనాల రద్దీ కారణంగా ఒక వైపు నుంచి మరో వైపునకు వెళ్లడం ఇబ్బందిగా మారింది. దీనికి పరిష్కారంగా సాగర తీర రహదారిలో సందర్శకుల కోసం భూగర్భంలో ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయనున్నారు. కురుసురా జలాంతర్గామి నుంచి నేరుగా టీయూ-142 బాంబర్ విమానం వరకు చేరుకునేలా ఈ నడక దారిని అభివృద్ధి చేస్తారు.
రూ.80కోట్ల అంచనాలతో భూగర్భ పార్కింగ్, సమీకృత పర్యాటక, సందర్శనాలయ తీర ప్రాజెక్టును వీఎంఆర్డీఏ ప్రతిపాదించింది. ఆర్‌కే బీచ్‌కు వచ్చే పర్యాటకులు తీరంలోని కురుసురా జలాంతర్గామి, టీయూ-142, సీహారియర్ , సందర్శనాలయాలను ఓకేసారి చూసేందుకు వీలుగా మార్గం నిర్మించనున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా భూగర్భం నుంచి నేరుగా వాటిని చేరుకునేందుకు ప్రణాళిక చేశారు. కురుసురా జలాంతర్గామి నుంచి నేరుగా టీయూను చేరుకునేలా భూగర్భంలో నడకదారి ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి సీహారియర్ మ్యూజియానికి పైనుంచి చేరుకోవాలి.