ఉప్పొంగిన జలాశయాలు
తెలంగాణలో పడుతున్న వర్షాలకు తోడు.. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటం వల్ల ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. స్వర్ణ, కడెం, కుమురంభీం ప్రాజెక్టులు నిండుగా కనిపిస్తున్నాయి. కడెం జలాశయం నుంచి నీటిని వదలడం వల్ల జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, కోటిలింగాల పుష్కర ఘాట్ల వద్దకు వరద చేరింది.
కాళేశ్వరంలో గంగమ్మ ఉరకలు
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలన్నీ జల పరవళ్లతో కళకళలాడుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజి 81 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజీ 4 గేట్లు ఎత్తి 18 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ వద్ద 5.98 టీఎంసీలు, అన్నారం బ్యారేజీ వద్ద 7.7 టీఎంసీలు, కన్నెపల్లి వద్ద 8 టీఎంసీల నీటి నిల్వ ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది.
కృష్ణమ్మ పరవళ్లు
కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. ఆలమట్టి నుంచి దిగువకు 2.85 లక్షల క్యూసెక్కుల భారీ ప్రవాహం వస్తోంది. దాదాపు అంతే మొత్తంలో నారాయణపూర్ నుంచి జూరాలకు నీరు విడుదలవుతోంది. ఆదివారం రాత్రికల్లా శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 100 టీఎంసీలకు చేరింది.