తితిదే పాలకమండలిలో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నామినేట్ చేస్తూ ఈనెల 15న ఏపీ ప్రభుత్వం జారీచేసిన రెండు జీవోల అమలును ఆ రాష్ట్ర హైకోర్టు నిలుపుదల చేసింది. ఏపీ దేవాదాయ చట్టం సెక్షన్ 96లోని నిబంధనలను ఉల్లంఘించేవిగా జీవోలు ఉన్నాయని అభిప్రాయపడింది. వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ(దేవాదాయ) శాఖ ముఖ్యకార్యదర్శి, తితిదే ఈవో, దేవాదాయశాఖ కమిషనర్‌కు నోటీసులు జారీచేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. దీనిపై లోతైన విచారణ జరపాలని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం.. రెండు ప్రజాహిత వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
తితిదే ప్రత్యేక ఆహ్వానితులుగా 52 మందిని నియమిస్తూ రెవెన్యూ (దేవాదాయ) శాఖ ముఖ్యకార్యదర్శి జి.వాణీమోహన్ ఈ నెల 15న జారీచేసిన జీవో 568, జీవో 569లను సవాలు చేస్తూ తెదేపా నాయకుడు ఎం.ఉమామహేశ్వరనాయుడు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఇదే అంశంపై హిందూ జనశక్తి సంక్షేమసంఘం వ్యవస్థాపకుడు కాకుమాను లలిత్‌కుమార్ మరో పిల్ వేశారు. బుధవారం రోజు జరిపిన విచారణలో ఉమామహేశ్వరనాయుడు తరఫున న్యాయవాది వై.బాలాజీ వడేరా వాదనలు వినిపించారు. ‘దేవాదాయ చట్టంలోని సెక్షన్ 96 ప్రకారం తితిదే బోర్డు సభ్యులుగా 29 మందిని మించి నియమించకూడదు. ప్రస్తుతం 29 మంది సభ్యులను, ప్రత్యేక ఆహ్వానితులుగా 52 మందిని నామినేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడింది. ప్రత్యేక ఆహ్వానితులకు అధికారాలు కట్టబెట్టడం సరికాదు. ప్రత్యేక ఆహ్వానితుల నియామకం తితిదే స్వతంత్రతను దెబ్బతీస్తుంది. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని జీవోల అమలును నిలుపుదల చేయండి’ అని కోరారు.
చట్టంలో నిషేధం లేదు: ఏజీ