తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలంగాణకు హ్యాండ్‌ ఇచ్చిన కేంద్రం.. మోదీపై హరీశ్ రావు ఆగ్రహం - గుజరాత్‌కు గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్

Global Center for Traditional Medicine : తెలంగాణపై కేంద్ర సర్కార్ మరోసారి పక్షపాత బుద్ధిని ప్రదర్శించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్ర వైఖరితో హైదరాబాద్​కు రావాల్సిన ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రం గుజరాత్​లోని జామ్​నగర్‌కు వెళ్లిందని మండిపడ్డారు. ఇది తెలంగాణకు మోదీ ప్రభుత్వం చేసిన ద్రోహమేనని విమర్శించారు.

Global Center for Traditional Medicine
Global Center for Traditional Medicine

By

Published : Mar 10, 2022, 7:15 AM IST

Global Center for Traditional Medicine : తెలంగాణకు దక్కాల్సిన ప్రతిష్ఠాత్మక సంస్థ కేంద్రం నిర్ణయంతో చేజారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నెలకొల్పాలని సంకల్పించిన ‘అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రం (గ్లోబల్‌ సెంటర్‌ ఫర్‌ ట్రెడిషనల్‌ మెడిసిన్‌)’ గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు తరలుతోంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ వైద్యసంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలంటూ కేంద్ర ఆయుష్‌ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. దానిపై రాష్ట్రసర్కారు కసరత్తు చేస్తుండగానే.. కేంద్రం అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి మండలి బుధవారం నిర్ణయం తీసుకుంది.

Harish Rao Fires on Modi : కొవిడ్‌ తొలిదశ ముగిసిన అనంతరం 2020 డిసెంబరులో అన్ని రాష్ట్రాల ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో తొలిసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో సంప్రదాయ వైద్యానికి పెరిగిన ప్రాధాన్యత దృష్ట్యా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విభాగంలో అంతర్జాతీయ కేంద్రాన్ని నెలకొల్పాలని భావిస్తోందని తెలిపారు. భారత్‌లో స్థాపనకు ఆసక్తి చూపిస్తోందని వెల్లడించారు. దీంతో ఈ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ అనుకూలంగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వివరించారు. హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకమైన సీసీఎంబీ, సీఎస్‌ఐఆర్‌, ఐఐటీ, డీఆర్‌డీఓ తదితర సంస్థలున్నాయని, అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రం పరిశోధనలకు అనువుగా ఉంటుందని వివరించారు. సానుకూలంగా స్పందించిన ప్రధానమంత్రి మోదీ ఆ మేరకు కేంద్ర ఆయుష్‌శాఖకు ఆదేశాలు జారీచేశారు.

Harish Rao Comments on Central Government : అనంతరం 2021 జనవరిలో కేంద్ర ఆయుష్‌శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ వచ్చింది. ఆ వెంటనే రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ దీనిపై ప్రతిపాదనలు రూపొందించింది. ఈ సంస్థ ఏర్పాటుకు 40-50 ఎకరాలు అవసరమవడంతో తొలుత దానిపై దృష్టిపెట్టింది. రంగారెడ్డి జిల్లా హిమాయత్‌సాగర్‌ గ్రామంలో నెలకొల్పాలని ప్రతిపాదన వచ్చినా.. ఆ స్థలాన్ని ఇప్పటికే ‘బయోసిన్‌ మెడికల్‌ బొటానికల్‌ పార్క్‌’కు కేటాయించి ఉండడంతో ఆ ప్రతిపాదన వాయిదాపడింది. అనంతరం హైదరాబాద్‌ ఐడీపీఎల్‌ సంస్థలోని ఖాళీ స్థలం కేటాయింపుపై పరిశీలన జరిగింది. ఈ క్రమంలోనే ఇటీవల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి త్వరగా స్థలాన్ని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ఐడీపీఎల్‌ స్థలం గ్రీన్‌జోన్‌గా పరిగణనలో ఉండడంతో.. ఇదే విషయాన్ని చెబుతూ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ నెల 2న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. మరో అనువైన ప్రదేశంలో ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎటువంటి సహకారాన్నైనా అందివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి సమన్వయకర్తగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ సైతం ఇవే విషయాలను వివరిస్తూ కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖ కార్యదర్శికి అధికారికంగా లేఖ రాశారు. ఇలా ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగుతుండగానే.. అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రాన్ని గుజరాత్‌కు తరలిస్తూ కేంద్ర కేబినెట్‌ తాజాగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

తెలంగాణకు మరోసారి మొండిచేయి

Central Partiality Towards Telangana : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం మరోసారి పక్షపాత బుద్ధిని ప్రదర్శించిందని, అన్ని విషయాల్లోనూ మొండిచేయి చూపుతోందని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. రాష్ట్రంలో అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రం స్థాపనకు స్థలం, వసతులు తదితర ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చినా.. గుజరాత్‌కు తరలించడం.. తెలంగాణకు చేసిన ద్రోహమేనని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వరుస అన్యాయాలపై భాజపా నేతలు నిలదీయాలని సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details