రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో ఉండిపోయిన తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏపీలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సురేష్ తెలిపారు. గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 13 మంది భాషా కోవిదులకు గిడుగు రామమూర్తి పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమానికి మంత్రి సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తపాలాశాఖ రూపొందించిన ప్రత్యేక కవర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినా తెలుగును కచ్చితంగా బోధించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఎన్నారైల సహకారంతో... తెలుగు విస్తరణ
తెలుగు గొప్పతనాన్ని ఖండాంతరాలకు విస్తరింపజేసేందుకు ఎన్నారైల సహకారం తీసుకుంటామన్నారు. తెలుగుకు సంబంధించిన ప్రత్యేక కోర్సులు, డిగ్రీలను తీసుకురానున్నట్టు వెల్లడించారు. తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. తెలుగు, సంస్కృతం వేరు కాదని చెప్పారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ మాట్లాడుతూ.. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాన్ని ‘తిక్కన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం’గా పేరు మార్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.