ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున గండిపడుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం తమకు నచ్చిన సంస్థలకే టెండ్లర్లు దక్కాలని తాపత్రయ పడుతున్నారు. మహానగరంలో కొత్తగా 155 కూడళ్ల వద్ద, 98 పాదచారులు దాటే ప్రాంతాల్లో పెలికాన్ సిగ్నళ్లు ఏర్పాటు చేసేందుకు నగర పాలకసంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయించింది. టెండరు ధర రూ.59 కోట్ల 86 లక్షలుగా ఖరారు చేశారు. అత్యాధునిక సమాచార పరిజ్ఞానం, ఏటా కనీసం రూ.20 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలు బిడ్లలో పాల్గొనాలని ప్రకటన విడుదల చేశారు.
అంచనా కంటే 17.60 శాతం అధికంగా
హైదరాబాద్‌కు చెందిన రెండు సంస్థలు దిల్లీలో ఉన్న మరో సంస్థ ప్రీ బిడ్‌లో పాల్గొన్నాయి. ఒక హైదరాబాద్ సంస్థ ప్రీబిడ్‌లో అర్హత పొందలేకపోయింది. మరో హైదరాబాద్ సంస్థ వార్షిక టర్నోవర్ రూ.20 కోట్ల కంటే తక్కువగా ఉండడంతో ఆ టెండర్‌ను తిరస్కరించారు. దీంతో టెండర్లలో ఒక్కటే సంస్థ పాల్గొన్నట్టు అయింది. అయితే ఆ సంస్థ అంచనా కంటే 17.60 శాతం అధికంగా అంటే రూ.59.86 కోట్లతో చేయాల్సిన పనులు రూ.72.26 కోట్లతో చేస్తామని పేర్కొంది.