హైదరాబాద్ శాస్త్రిపురంలోని పరిశ్రమలు మూసివేయాలంటూ జారీ చేసిన నోటీసులను జీహెచ్ఎంసీ వెనక్కి తీసుకుంది. దీంతో హైకోర్టులో దాఖలైన సుమారు ఏడు వందలకుపైగా పిటిషన్లపై విచారణ ముగిసింది. కాటేదాన్, శాస్త్రిపురం, టాటానగర్ పరిసరాల్లో అనేక పరిశ్రమలు కాలుష్యం వెదజల్లుతున్నాయని... నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాటిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని గతంలో హైకోర్టులో పిల్ దాఖలైంది. వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు... కాలుష్య పరిశ్రమలపై వెంటనే చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలు మూసివేయాలని వందల పరిశ్రమలకు జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. అయితే తమ పరిశ్రమ నుంచి ఎలాంటి కాలుష్యం లేనప్పటికీ... జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చిందంటూ సుమారు 700 కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. కాలుష్యం లేనప్పటికీ వివిధ ఇతర నిబంధనలు ఉల్లంఘించి పరిశ్రమ నిర్వహిస్తున్నట్టు విచారణ సందర్భంగా హైకోర్టుకు జీహెచ్ఎంసీ వివరించింది. అయితే సరైన కారణాలు ప్రస్తావించకుండా... నోటీసులు జారీ చేయడాన్ని ఇటీవల హైకోర్టు తప్పుబట్టింది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్య వైఖరి వల్ల వందల పిటిషన్లు దాఖలవుతున్నాయని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.