తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆస్తిపన్ను బకాయిల వసూలు కోసం.. జీహెచ్​ఎంసీ ప్రణాళికలు! - Ghmc Planing to Collect Pending Property Taxes in Ghmc

జీహెచ్​ఎంసీ ఆస్తిప‌న్ను మొండి బ‌కాయిల వసూళ్ల‌కు ప్ర‌భుత్వం వ‌న్​టైమ్ సెటిల్​మెంట్ స్కీమ్​ తీసుకొచ్చి.. ఆస్తిప‌న్ను వ‌డ్డీలో 90శాతం మాఫీ చేసినా ఆశించిన ఫ‌లితం రాలేదు. చాలామంది యజమానులు ఆస్తిపన్ను చెల్లించేందుకు ముఖం చాటేస్తున్నారు. ఓటీఎస్ స్కీమ్​ కింద ఆస్తిపన్ను మీద వడ్డీమాఫీ చేసినా.. గత 45 రోజుల్లో గ్రేట‌ర్ పరిధిలో కేవ‌లం రూ.174.27 కోట్లు మాత్ర‌మే వ‌సూలయ్యాయి. ఈ మేరకు ఆస్తిపన్ను పూర్తిస్థాయిలో వసూలు చేసేందుకు ప్ర‌భుత్వం 90శాతం వ‌డ్డీ మాఫీ ప‌థ‌కాన్ని మ‌రో 45 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సారైనా అధిక మొత్తంలో ఆస్తిపన్ను వ‌సూలు చేయాల‌ని బ‌ల్దియా ల‌క్ష్యంగా పెట్టుకుంది.

Ghmc Planing to Collect Pending Property Taxes in Ghmc
మొండి బకాయిల వసూలు కోసం.. జీహెచ్​ఎంసీ ప్రణాళికలు!

By

Published : Sep 17, 2020, 7:22 PM IST

బకాయిలో ఉన్న ఆస్తిపన్నును పూర్తిస్థాయిలో వసూలు చేసేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మార్చి వ‌ర‌కు ఆస్తిప‌న్నుపై ఉన్న వడ్డీలో 90 శాతం రద్దు చేస్తూ వ‌న్​టైమ్ సెటిల్​మెంట్ స్కీమ్​ను ప్ర‌వేశపెట్టింది. ఆగ‌స్టు ఒక‌టో తేదీ నుంచి సెప్టెంబ‌ర్ 15వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించినప్పటికీ.. ఆశించిన స్థాయిలో ఫ‌లితాలు రాలేదు. గ్రేట‌ర్ పరిధి​లో ఆస్తిపన్ను బకాయిల వ‌సూళ్ల‌కు ప‌్రత్యేక‌ మేళాలు ఏర్పాటు చేసి... అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగినా బ‌కాయిలు మాత్రం వ‌సూలు కావ‌డం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అక్టోబ‌ర్ నెలాఖరు వ‌ర‌కు ఈ ప‌థ‌కాన్ని పొడిగిస్తున్న‌ట్లు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్ వెల్ల‌డించారు. ఈ సారైనా మొండి బ‌కాయిల‌ను మ‌రింత ప‌క‌డ్బందీగా వసూలు చేయాల‌ని బ‌ల్దియా అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. వ‌న్​టైమ్​ సెటిల్​మెంట్​ స్కీమ్​ కింద‌ ప‌దిశాతం వ‌డ్డీతో క‌లిపి గ్రేట‌ర్ పరిధిలో మొత్తం రూ.1547.10 కోట్ల మొండి బ‌కాయిలు వ‌సూలు కావాల్సి ఉండగా... 45 రోజుల్లో కేవ‌లం రూ.174.27 కోట్లు మాత్ర‌మే వ‌సూలయ్యాయి. గ్రేట‌ర్​లో మొత్తం 5.41 ల‌క్ష‌లమంది యజ‌మానులను జీహెచ్​ఎంసీ ఆస్తిప‌న్ను వ‌డ్డీమాఫీ ప‌థకానికి అర్హులుగా తేల్చింది. ఇందులో ఇప్ప‌టి వ‌ర‌కు 78,137మంది యజ‌మానులు మాత్రమే మొండి బ‌కాయిలు చెల్లించారు.

అక్టోబర్​ నాటికి వసూలయ్యేనా?

జంట న‌గ‌రాల్లో మొత్తం ఆస్తిపన్ను కట్టాల్సిన నిర్మాణాలు 16ల‌క్ష‌లకు పైనే ఉన్నాయి. ఇందులో నివాస గృహాలతో పాటు.. వాణిజ్య కార్యక‌లా‌పాలు నిర్వ‌హించే నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఇందులో 11 ల‌క్ష‌ల యాజ‌మాన్యాలు ప్రతిఏటా ఆస్తిప‌న్ను చెల్లిస్తున్నారు. ఆస్తిపన్ను చెల్లింపు, వసూళ్ల విషయంలో తలెత్తే సమస్యలను పరిష్కరించి.. పూర్తిస్థాయిలో పన్ను వసూలు చేసేందుకు బల్దియా కసరత్తులు చేస్తోంది. ఇందుకు గానూ ప్రత్యేక ఆస్తిపన్ను మేళాలు నిర్వహిస్తోంది. క్షేత్ర‌స్థాయిలో అధికారులకు లక్ష్యాలను నిర్దేశించి పన్నుల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టేందుకు ప్రయత్నించినా.. ఆశించిన ఫ‌లితాలు రాలేదు. బ‌కాయిదారుల్లో లక్ష నుంచి వెయ్యి రూపాయల వరకు చెల్లించాల్సిన వారు కూడా కొన్నేళ్లుగా పన్ను కట్టడం లేదు. పన్ను బ‌కాయి పడ్డ ఆస్తుల్లో అధిక శాతం వివాదాల్లో ఉన్నాయని... కోర్టులో కేసులు ఉండటం వల్ల యజమానులు బ‌కాయిలు చెల్లించేందుకు ముందుకు రావ‌డం లేద‌ని అధికారులు చెప్తున్నారు. పలు కార్యక్రమాలు చేపట్టి అక్టోబ‌ర్ నాటికి పెద్ద మొత్తంలో మొండి బ‌కాయిలు వ‌సూలు చేస్త‌ామని గ్రేటర్​ అధికారులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

కరోనా దెబ్బకొట్టింది!

2020-21 ఆర్థిక సంవత్సరంలో 1800 కోట్ల రూపాయ‌ల‌ ఆస్తి పన్ను వ‌సూళ్లను జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేందుకు అవకాశం ఉన్న అన్ని కార్యక్రమాలను బ‌ల్దియా అమలు చేయనుంది. ఈ ఆర్థిక ఏడాది ఆరంభంలో ఎర్లీబర్డ్ ప‌థ‌కం ద్వారా ఆస్తి ప‌న్ను చెల్లిస్తే.. ప‌న్నులో 5 శాతం త‌గ్గించే ప‌థ‌కం తీసుకొచ్చారు. ఎర్లీబ‌ర్డ్ ప‌థ‌కం కింద ఏప్రిల్, మే నెల‌ల్లో మొత్తం రూ.570 కోట్లు వ‌సూలయ్యాయి. ఆ తరువాత కరోనా తీవ్రత పెరగడం వల్ల జూన్, జులై నెలల్లో ఆస్తిప‌న్ను వసూళ్లు మందగించాయి. ఈ ఐదున్న‌ర నెల‌ల్లో మొత్తం రూ.800 కోట్ల ఆస్తిప‌న్ను వసూలు అయింది. ఇటు మొండి బ‌కాయిల‌తో పాటు ప్ర‌స్తుత ఏడాది ప‌న్నుల‌ను వసూలు చేయడం కూడా లక్ష్యంగా పెట్టుకొని బల్దియా కసరత్తులు చేస్తోంది.

ఇవీ చూడండి: 'డబుల్​ బెడ్​ రూం లబ్దిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉండాలి'

ABOUT THE AUTHOR

...view details