గ్రేటర్ పరిధిలో 9,103 కి.మీల మేర రోడ్లు ఉండగా.. వాటిపై మొత్తం 4.5లక్షల విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. ఇందులో 4లక్షలు ప్రధాన రోడ్లు, వీధుల్లో ఉండగా.. 54వేలకు పైగా ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. హైమాస్ట్ దీపాలు 6,531 ఉన్నాయి. వీటి నిర్వహణకు బల్దియా భారీగా ఖర్చు చేస్తోంది. 2018లో రూ.7 కోట్లు వ్యయం చేయగా.. ప్రస్తుతం రూ.21.50కోట్లకు చేరింది. నగరవాసుల నుంచి ఫిర్యాదులు రావడంతో గతేడాది గ్రేటర్‌లోని కొన్ని ప్రాంతాల్లో సుమారు 10వేల వీధి దీపాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అది కార్యరూపం దాల్చక చాలా చోట్ల ఇంకా చీకట్లే అలముకున్నాయి. ప్రధానంగా రాజేంద్రనగర్, చాంద్రాయణగుట్ట, కిషన్‌బాగ్, ఖాజాగూడ సర్కిల్, కావూరిహిల్స్, ఎల్బీనగర్, అల్వాల్, మల్కాజిగిరి, నాగోల్, నానల్‌నగర్, రెతిబౌలి, మియాపూర్, సుచిత్ర, సికింద్రాబాద్‌లోని అంతర్గత బస్తీలు, ప్రధాన జంక్షన్ల వద్ద లైట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
20శాతం ఫిర్యాదులు ఇవే..
బల్దియాకు వచ్చే ఫిర్యాదుల్లో 20శాతానికి పైగా విద్యుద్దీపాలపైనే ఉంటున్నాయి. శివారు, జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో మహిళలు, పిల్లలు రాత్రివేళ బయటకు వెళ్లేందుకు జంకుతున్నారంటూ పలు కాలనీల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. టోలిచౌకి నుంచి జూబ్లీహిల్స్ వైపు రోడ్లపై గుంతలు ఉండటం, ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులకు విన్నవిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో రాత్రి 10 అయ్యిందంటే చీకట్లు కమ్ముకుంటున్నాయని, బయటకి వెళ్లాలంటేనే భయంగా ఉంటుందని ఐటీ ఉద్యోగి శ్రీకాంత్ తెలిపారు. ఎక్కువ సంఖ్యలో విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.