సుదీర్ఘ విరామానికి తెర పడనుంది. రెండు నెలల క్రితం ఎన్నికైన జీహెచ్ఎంసీ నూతన కార్పొరేటర్లు గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం 150 డివిజన్లకు సంబంధించి ఎన్నిక నిర్వహించి... డిసెంబర్లో ఫలితాలు ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు గెలిచినా ఇప్పటివరకు పదవి బాధ్యతలు స్వీకరించలేదు. గురువారంతో పాత పాలకవర్గం కాలం పూర్తవనుండగా... నూతన పాలకవర్గం కొలువుదీరనుంది. ఇందుకోసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నూతన కార్పొరేటర్లు... గురువారం ఉదయం 10 గంటల 30 నిమిషాలలోపు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.
అభ్యర్థులు తమ గుర్తింపును నిర్ధరించుకొని సమావేశ మందిరానికి ఉదయం 11 గంటలలోపు పంపనున్నారు. ఉదయం 11 గంటలకు నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమవుతుంది. నూతనంగా గెలిచిన భాజపాకు చెందిన లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేశ్ గౌడ్ ఒకరు చనిపోవడం వల్ల మొత్తం 149 మంది కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకార పత్రాన్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలలో ఏదైనా ఎంచుకొని తమ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల పరిశీలకులుగా సందీప్ కుమార్ సుల్తానియా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు మధ్య ఎన్నిక నిర్వహించనున్నారు. ప్రతీ సభ్యుడు తమ ఫొటో కలిగిన ఏదేని గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. సమావేశం నిర్వహణను తెలియజేస్తూ... ఇప్పటికే జీహెచ్ఎంసీ పంపిన లేఖను, ఆర్వో ఇచ్చిన గెలుపు పత్రాన్ని కూడా సభ్యులు తీసుకురావాలని సూచించారు. కేవలం సభ్యులను మాత్రమే కౌన్సిల్హాల్లోకి అనుమతించనున్నారు.